శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 18:34:11

రాబోయే మూడు రోజుల్లో పొడి వాతావరణం : ఐఎండీ

రాబోయే మూడు రోజుల్లో పొడి వాతావరణం : ఐఎండీ

హైదరాబాద్‌ : రాగల మూడు రోజుల్లో తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆదిలాబాద్ జిల్లాలోని బేలా మండలం శుక్రవారం ఉదయం 10.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, ఆసిఫాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కనీస ఉష్ణోగ్రతలు ఒకే స్థాయిలో ఉన్నాయి. హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రాబోయే రెండు, మూడు రోజుల్లో ఉష్ణోగ్రత తగ్గుతుందని హైదరాబాద్ వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.


‘మేం ఉష్ణోగ్రతల్లో రెండు నుంచి మూడు డిగ్రీల తగ్గుదలను చూస్తున్నాం. ఇది మరో రెండు నుంచి మూడు రోజులు కొనసాగుతుంది’ అని హైదరాబాద్‌లోని ఐఎండీ డైరెక్టర్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ కే నాగరత్న పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రధానంగా దిగువ స్థాయి ఈశాన్య గాలులు వీస్తున్నాయి. ‘మధ్య, వాయువ్య భారతదేశంపై యాంటీ సైక్లోనిక్ సర్క్యులేషన్లు ఉన్నాయని, ఇది చల్లని గాలిని తెచ్చి, తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గేందుకు దారితీస్తుంది’ చెప్పారు. రాబోయే 15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణో్గ్రతలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయని, నవంబర్‌ 9 తర్వాత మరోసారి పడిపోతాయని, దీంతో ఉత్తర, వాయువ్య జిల్లాలు మూడు రోజల పాటు ఉష్ణోగ్రతలు తగ్గువగా నమోదవుతాయని చెప్పారు.


నవంబర్‌ పరివర్తన కాలమని, గాలులు వాటి దిశలను మార్చడం, ఉష్ణోగ్రతలు పడిపోవడం అసాధారణ లక్షణాలు కాదన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం 15.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, ఇది సాధారణం నుంచి -3.3 డిగ్రీలు తక్కువని, హైదరాబాద్‌లో 1981లో నవంబర్ నెలలో అత్యల్పంగా 10.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. నవంబర్‌ చివరి వారంలో శీతాకాలం ప్రవేశిస్తుందని అంచనా వేస్తున్నట్లు నాగరత్న వివరించారు. ఇదిలా ఉండగా.. శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. నల్గొండ, మలుగు, సిద్దిపేట, వికారాబాద్‌, నాగర్‌కర్నూల్‌, జగిత్యాల, సంగారెడ్డి, జయశంకర్‌ భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా జల్లులు పడ్డాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.