ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 14, 2020 , 01:05:01

డ్రోన్‌ ప్రయోగం రాజకీయకుట్ర

డ్రోన్‌ ప్రయోగం రాజకీయకుట్ర
  • పక్కా ఆధారాలతోనే రేవంత్‌పై కేసు: లోక్‌సభలో నామా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నిబంధనలను తుంగలోతొక్కిన కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి రాజకీయ కుట్రతో మంత్రి కేటీఆర్‌ ఫాంహౌజ్‌పై డ్రోన్‌ కెమెరాను ప్రయోగించారని లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్షనేత నామా నాగేశ్వరరావు ఆరోపించారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్ట్‌కు విరుద్ధంగా వ్యవహరించి ప్రైవేట్‌ ఆస్తిపై డ్రోన్‌ను ప్రయోగించినందుకే ఆయనపై చట్టపరంగా కేసులు నమోదుచేశారని తెలిపారు. గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్‌ సభ్యుడు రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ అంశాన్ని లేవనెత్తడంతో నామా తీవ్రంగా స్పందించారు. రేవంత్‌ ఎంపీగా తన బాధ్యతను విస్మరించి ప్రైవేట్‌ వ్యక్తుల ఆస్తులు, స్థలాల్లోకి అక్రమంగా ప్రవేశించి ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్ట్‌ను ఉల్లంఘించి డ్రోన్‌తో చిత్రీకరించడం సమంజసమా అని ప్రశ్నించారు. దీనిపై నార్సింగి ఠాణాలో కేసు నమోదైందని తెలిపారు. కేసులో ఏ1గా ఉన్న రేవంత్‌రెడ్డిపై కీలక ఆధారాలున్నాయని, పూర్తి ఆధా రాలతోనే కేసు నమోదుచేశారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు మరింత పెంచాలని నిధుల అంశంపై చర్చలో నామా కోరారు.  ఆయా వర్గాలకు కేంద్రం రూ.10వేల కోట్లు కేటాయిస్తే, తెలంగాణ  రూ.1,600 కోట్లు కేటాయించిందన్నారు.


logo