మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 02:40:41

పాటలు వింటూ ప్రాణాలు కోల్పోయాడు!

పాటలు వింటూ ప్రాణాలు కోల్పోయాడు!

  • ప్రాణం తీసిన ఫోన్‌ డ్రైవింగ్‌!
  • బస్సు వెనుక టైర్ల కింద పడి ఒకరి దుర్మరణం
  • అంబర్‌పేట పీఎస్‌ పరిధిలో విషాద ఘటన

గోల్నాక: నిర్లక్ష్యం చిన్నదే అయినా మూల్యం చెల్లించక తప్పడం లేదు. ఫోన్‌ మాట్లాడుతూ, ఇయర్‌ ఫోన్స్‌తో పాటలు వింటూ బైక్‌ నడిపిన ఎందరో ప్రమాదాల బారిన పడ్డారు. కొందరు ప్రాణాలే కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అయినా చాలామంది మారడం లేదు. తాజాగా ఇయర్‌ ఫోన్స్‌తో పాటలువింటూ బైక్‌ నడుపుతున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.. బస్సు వెనుక టైర్ల కింద పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన గురువారం అంబర్‌పేట పీఎస్‌ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్‌స్పెక్టర్‌ బిట్టు మోహన్‌కుమార్‌, ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం..  ఏపీలోని కర్నూలుకు చెందిన మహ్మద్‌ ఫరూఖ్‌ (34)కు భార్య, ఇద్దరు పిల్లలు. భార్య పిల్లలను స్వస్థలంలో ఉంచి బాగ్‌అంబర్‌పేట తురాబ్‌నగర్‌లో నివాసముంటున్నారు. 

ఇబ్రహీంపట్నంలోని గురునానక్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. రోజుమాదిరిగా ఫరూఖ్‌  గురువారం ఉదయం 8.30 గంటలకు ఇంటి నుంచి తన బైక్‌పై బయలుదేరారు. అంబర్‌పేట ప్రధాన రహదారి నుంచి ఉప్పల్‌ వైపు వెళ్తున్నారు. ఇయర్‌ఫోన్స్‌తో పాటలు వింటూ బైక్‌ డ్రైవ్‌ చేస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో కుషాయిగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి వేగంగా వచ్చింది. మరో బైక్‌ను క్రాస్‌చేసే క్రమంలో బస్సును గమనించని ఫరూఖ్‌ బైక్‌ను ఒక్కసారిగా కుడి వైపు మళ్లించి క్షణాల వ్యవధిలోనే బస్సు వెనుక టైర్ల కింద పడిపోయాడు. తలకు ధరించిన హెల్మెట్‌తోసహా ఫరూఖ్‌ తల నుజ్జునుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.