శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 03:41:28

డ్రెస్‌కోడ్‌ దొంగ

డ్రెస్‌కోడ్‌ దొంగ

  • తాళంవేసిన ఇండ్లపై అనాసక్తి
  • కుటుంబసభ్యులున్న ఇంట్లోనే చోరీ
  • కండ్లు మాత్రమే కనిపించేలా వస్త్రధారణ
  • మరణ ధ్రువీకరణపత్రంతో పోలీసులకు బురిడీ
  • 22 ఏండ్లుగా దొంగతనాలు
  • ఘరానా దొంగను అరెస్ట్‌చేసిన పోలీసులు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  ఈ దొంగ చాలా విచిత్రమైనోడు. తాళం వేసిన ఇం ఇంట్లో చోరీచేయడు. కుటుంబసభ్యులు ఉన్న ఆ ఇంటినే దొంగతనానికి ఎంచుకొంటాడు. నలుపురంగు దుస్తులు ధరించి చోరీలు చేయ డం ఇతడి అలవాటు. ఇలా  22 ఏండ్లుగా చోరీలుచేస్తూ కోట్ల రూపాయలు దోచుకొన్నా డు. పోలీసుల దృష్టి మరల్చేందుకు మరణ ధ్రువీకరణ పత్రాలను సృష్టించి మరీ తొమ్మిదేండ్లపాటు దొంగతనాలు చేశాడు. దొంగతనం చేసిన డబ్బుతో జల్సాలకుచేస్తూ నాలుగు రాష్ర్టాల పోలీసులకు మోస్ట్‌వాంటెడ్‌గా నిలిచాడు. తెలంగాణ పోలీసులు మాత్రం ఈ ఘరానాదొంగను వెంటాడి పట్టుకున్నారు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నాడు. ఇతడే మహారాష్ట్రకు చెందిన సంతోష్‌షిండే. 1998 నుంచి చోరీలు చేస్తున్నాడు. ఆ సమయంలో నలుపురంగు డ్రెస్‌ ధరించి కండ్లు మాత్రమే కనిపించేలా ముఖానికి నలుపు వస్ర్తాన్ని నిం డుగా చుట్టుకొంటాడు. చోరీకి వెళ్లే ముందు తానొక్కడే కాకుండా ముఠాలోని సభ్యులందరికీ ఈ డ్రెస్‌కోడ్‌ తప్పనిసరి చేస్తాడు. రాత్రిపూటచోరీలకు నలుపురంగు డ్రెస్‌కోడ్‌తో వెళితే సీసీ కెమెరాల్లో రికార్డింగ్‌లో క్లారిటీ ఉండదని, బయటివ్యక్తులు ఈజీగా గుర్తుపట్టరని ఇతడి నమ్మకం. ఇతడి నుంచి సొత్తు రికవరీ పోలీసులకు సవాల్‌గా మారింది. ఇక్కడంటే.. అక్కడనీ.. అక్కడ కాదు మరెక్కడో గుర్తుకు రావ డం లేదని పోలీసులకు చుక్కలు చూపిస్తాడు. ఇటీవల మహారాష్ట్ర నాందేడ్‌లో చోరీ సొత్తు అమ్మానని చెప్పడంతో.. తెలంగాణ పోలీసులు రికవరీ కోసం వెళ్లగా రిసీవర్‌ భవనం పైనుంచి దూకి మృతిచెందాడు. ఈ సంఘటనలో తెలంగాణ సైబరాబాద్‌ పోలీసులపై మహారాష్ట్రలో కస్టోడియల్‌ డెత్‌ కేసు నమోదయింది.

ఇంట్లో ఉంటేనే చొరబడుతా

తాళంవేసిన ఇండ్లను సంతోష్‌షిండే టార్గెట్‌ చేయడు. తాళం వేసిన ఇండ్లలో ఖరీదైన వస్తువులు, నగలు ఉండవని ఇతడి నమ్మకం. అందరూ ఉన్న ఇండ్లలోనే చోరీలు చేయడం మహా సరదా. ఈ ఇండ్లలోనే ఎక్కువ ఖరీదైన వస్తువులు ఉంటాయని, అప్పుడే గిట్టుబాటు అవుతుందని భావిస్తుంటాడు. టార్గెట్‌ చేసుకొన్న ఇంటి పరిసరాలకు చేరుకొని ఇతడి ముఠా సభ్యులు చెట్ల పొదల్లో దాక్కుంటారు. అర్ధరాత్రి నుంచి నాలుగు గంటల మధ్య చోరీలు చేసి దగ్గర్లోని రైల్వేస్టేషన్‌కు పారిపోయి అక్కడి నుంచి మహారాష్ట్రకు వెళ్లిపోతారు. ఇందుకు రైల్వేస్టేషన్‌కు సమీప ఇండ్లనే చోరీకి ఎంచుకొంటారు. కిటికి గ్రిల్స్‌గానీ, బాల్కనీ గ్రిల్స్‌గానీ తొలగించి ఇంట్లోకి ప్రవేశిస్తారు. సం తోష్‌ వెనుకాలే వెళ్లే మరో వ్యక్తి.. పారిపోయేందుకు వీలుగా ఇంటి తలుపులు అన్నింటినీ తెరిచిపెడుతాడు. నేరుగా బెడ్‌రూంలోని కప్‌బోర్డులు, అల్మారాల వద్దకు వెళ్లి అందినకాడికి నగదు, నగలు దోచుకొని చెక్కేస్తారు. ఒకవేళ ఎవరైనా కుటుంబసభ్యులు నిద్ర లేచి అరిచేందుకు ప్రయత్నిస్తే కర్రలు, రాడ్లతో కొట్టేందుకు కూడా వెనుకాడరు. ఇలా దాదాపు 24 దొంగతనాలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.

పట్టించిన వేలిముద్రలు

సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని అల్వాల్‌లో 2015లో జరిగిన ఒక చోరీ కేసులో వేలుముద్రల పరిశీలనలో కొన్ని అనుమానాలు తలెత్తాయి. అవి 1998 నాటి మాదాపూర్‌ దోపిడీ కేసులో దొరికిన నిందితుడి వేలిముద్రలతో సరిపోయాయి. సంతోష్‌షిండే 2005లోనే చనిపోయాడని అతడి కుటుంబసభ్యులు ధ్రువపత్రాలు చూపి మాదాపూర్‌ పోలీసులను బోల్తాకొట్టించారు. సంతోష్‌షిండేను పట్టుకొని తీరాలన్న కసితో సైబరాబాద్‌ పోలీసులు శ్రమించి చివరకు గత నెలలో అదుపులోకి తీసుకొన్నారు.


logo