ఆదివారం 07 జూన్ 2020
Telangana - Mar 29, 2020 , 00:42:54

పక్కాగా పాల సరఫరా

పక్కాగా పాల సరఫరా

-డెయిరీ సిబ్బందికి డ్రెస్‌కోడ్‌, ఐడీకార్డులు జారీచేయండి

-డెయిరీ ప్రతినిధులతో సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో పాలు, పాల పదార్థాల సరఫరాకు ప్రభుత్వం పక్కా చర్యలు తీసుకుంటున్నదని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. పాలు సరఫరా చేసే సిబ్బంది డ్రెస్‌కోడ్‌ పాటించేలా, వారికి ఐడీకార్డులు జారీచేసేలా డెయిరీ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మాసాబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధకశాఖ కాన్ఫరెన్స్‌హాల్‌లో శనివారం హెరిటేజ్‌, జెర్సీ, దొడ్ల, తిరుమల, అమూల్‌, కరీంనగర్‌, మస్కతి, మదర్‌ డెయిరీ, ముకుంద డెయిరీ ప్రతినిధులతో తలసాని సమావేశం నిర్వహించారు. డెయిరీ నిర్వాహకులకు సమస్యలుంటే కంట్రోల్‌ రూం నంబర్‌ 040-23450624 కు ఫిర్యాదుచేయాలని చెప్పారు. నిత్యావసర వస్తువులను ఎమ్మార్పీ కంటే ఎక్కువకు విక్రయిస్తే పీడీయాక్ట్‌ కింద క్రిమినల్‌ కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. కరోనా నేపథ్యంలో పాల సరఫరాకు డెలివరీ బాయ్స్‌ ముందుకు రావడంలేదని డెయిరీ నిర్వాహకులు తెలుపగా.. స్విగ్గి, బిగ్‌బాస్కెట్‌ తదితర డోర్‌డెలివరీ సంస్థల ద్వారా అవసరమైన మేరకు పాలు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని తలసాని ఆదేశించారు. పాల ఉత్పత్తుల సరఫరా సమయాన్ని కూడా పెంచేలా కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి పశుసంవర్ధకశాఖ కార్యదర్శి అనితా రాజేంద్రన్‌, విజయడెయిరీ ఎండీ శ్రీనివాస్‌రావు, నార్మూల్‌ ఎండీ రమేశ్‌, దొడ్ల సీఈవో బీవీకే శంకరయ్య, ముకుంద డెయిరీ నుంచి శంకరయ్య, కరీంనగర్‌ డెయిరీ జీఎం ప్రభాకర్‌, జెర్సీ నుంచి గిరిభాస్కర్‌, హెరిటేజ్‌, అమూల్‌ డెయిరీ నుంచి వైబీరెడ్డి, మస్కతి డెయిరీ ఎండీ సుల్తాన్‌ బిన్‌ ఇబ్రహీం హాజరయ్యారు.

అధిక ధరలకు దాణా విక్రయిస్తే పీడీయాక్ట్‌ 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పశుగ్రాసం, దాణాను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌.. అధికారులను ఆదేశించారు. అవసరమైతే పీడీయాక్ట్‌ కింద కేసు నమోదుచేయాలని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ వీ లక్ష్మారెడ్డి, అదనపు డైరెక్టర్‌ డాక్టర్‌ రాచందర్‌, డెయిరీ ఎండీ శ్రీనివాస్‌రావుతో నిర్వహించిన సమావేశంలో తలసాని మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు దాణా విక్రయించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. వ్యాపారులు దాణా కృత్రిమ కొరత సృష్టించకుండా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే 9121213220 నంబర్‌కు ఫిర్యాదుచేయాలని మంత్రి సూచించారు


logo