శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 03:11:58

డీఆర్డీవో పరిశోధన కేంద్రం

డీఆర్డీవో పరిశోధన కేంద్రం

  • హైదరాబాద్‌ ఐఐటీలో భవిష్యత్తు రక్షణరంగ అవసరాలను తీర్చే టెక్నాలజీపై పరిశోధనలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశానికి రక్షణ ఉత్పత్తులను అందించే డీఆర్డీవో(రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ) త్వరలో హైదరాబాద్‌ ఐఐటీలో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నది. ‘డీఆర్డీవో-ఐఐటీ హెచ్‌ రిసెర్చ్‌సెల్‌' పేరుతో త్వరలో ప్రారంభించనున్నారు. భవిష్యత్తులో దేశ రక్షణ అవసరాలను తీర్చే సాంకేతిక పరిజ్ఞానంపై ఈ కేంద్రంలో పరిశోధనలు చేయనున్నారు. ఎంపికచేసిన రంగాల్లో బేసిక్‌, అప్లయిడ్‌ రిసెర్చ్‌ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తామని డీఆర్డీవో వర్గాలు తెలిపాయి. ఇప్పటికే చెన్నైలో ఉన్న రిసెర్చ్‌ అండ్‌ ఇన్నొవేషన్‌ సెంటర్‌కు కొనసాగింపుగా దీనిని ఏర్పాటుచేస్తున్నట్టు పేర్కొన్నాయి. ఈ మేరకు ఎంవోయూపై డీఆర్డీవో డైరెక్టర్‌ జనరల్‌ (ఎంఎస్‌ఎస్‌) ఎంఎస్‌ఆర్‌ ప్రసాద్‌, డైరెక్టర్‌ (డీఎఫ్‌టీఎం) కేకే పాఠక్‌, ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి సంతకాలు చేశారు. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌ విధానంలో ఇటీవలే ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా డీఆర్డీవో చైర్మన్‌ సతీశ్‌రెడ్డి స్పందిస్తూ.. డీఆర్డీవో, ఐఐటీ హైదరాబాద్‌ కలిసి దేశీయ పరిజ్ఞానాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. రక్షణ రంగానికి సంబంధించి దిగుమతులపై ఆధారపడకుండా స్వయంసమృద్ధి సాధించాలన్న లక్ష్యానికి ఈ ఒప్పందం సహకరిస్తుందని డీఆర్డీవో వర్గాలు పేర్కొన్నాయి.


logo