గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 03:36:36

కరోనా రోగులపై ‘సంపర్క్‌' నిఘా!

కరోనా రోగులపై ‘సంపర్క్‌' నిఘా!

  • గృహనిర్బంధం ఉల్లంఘిస్తే అలర్ట్‌ 
  • యాప్‌ రూపకల్పనకు ఆర్డీవో, టీటా ఒప్పందం 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హోంఐసొలేషన్‌, హోంక్వారంటైన్‌లో ఉన్నవారు నిర్ణీత పరిధిదాటి కాలు బయటపెడితే ఇక దొరికిపోతారు. కొవిడ్‌ బాధితుల కదలికల పర్యవేక్షణకు రక్షణ ఉత్పత్తుల తయారీసంస్థ డీఆర్డీవో, తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టిటా) ప్రత్యేకంగా యాప్‌ రూపొందించనున్నాయి. స్మార్ట్‌ ఆటోమేటెడ్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ పేషెంట్స్‌, రిస్క్స్‌ (సంపర్క్‌) పేరిట డీఆర్డీవో రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ సాయంతో యాప్‌ను తయారుచేయనున్నా యి. ఇందుకు రెండుసంస్థలు సోమవారం ఒప్పం దం కుదుర్చుకున్నాయి. డీఆర్డీవోకు చెందిన సెం టర్‌ ఫర్‌ ఏఐ, రొబోటిక్స్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ రితురాజ్‌కుమార్‌, టిటా గ్లోబల్‌ ప్రెసిడెంట్‌ సందీప్‌కుమార్‌ మక్తాల ఒప్పందపత్రాలను ఆన్‌లైన్‌లో మార్చుకున్నారు. త్వరలో రాష్ట్రంలోని ఏదైనా ఒక జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు రూపంలో దీన్ని అమలుచేయనున్నారు. ఐసొలేషన్‌ లేదా క్వారంటైన్‌లో ఉన్న కొవిడ్‌ బాధితులను పర్యవేక్షించడం పోలీసులు, ఆరోగ్యసిబ్బందికి సమస్యగా మారింది. బాధితులు పరిధిదాటి బయటకు వెళ్లినా.. వారి కదలికలను సంపర్క్‌ యాప్‌తో సులువుగా గుర్తించవచ్చు. బాధితులు పూర్తివివరాలను అందజేసి.. ఈ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రతి 15 నిమిషాలకోసారి కొవిడ్‌ సర్వర్‌కు డాటా అందజేస్తుంది. జియోఫెన్సింగ్‌ ప్రాంగణాన్ని రోగి ఉల్లంఘిస్తే స్మార్ట్‌ఫోన్‌ ద్వారా హెచ్చరిక సందేశం పంపిస్తుంది. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు టీటాను భాగస్వామ్య సంస్థగా ఎంచుకోవటం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని టీటా గ్లోబల్‌ ప్రెసిడెంట్‌ సందీప్‌ కుమార్‌ సంతోషం వ్యక్తంచేశారు.  logo