గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 03:13:27

త్వరలో అర్బన్‌ తెలంగాణ

త్వరలో అర్బన్‌ తెలంగాణ

  • 30 ఏండ్లకు ప్రణాళిక సిద్ధం 
  • ఆదాయం పెంచేలా నిర్వహణ 
  • పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌
  • పారిశుద్ధ్య నిర్వహణకు యాప్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అత్యధిక మంది పట్టణ ప్రాంతాల్లో నివసించే అర్బన్‌ రాష్ట్రంగా తెలంగాణ త్వరలోనే మారనున్నదని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 40 శాతానికిపైగా జనాభా పట్టణాల్లో నివసిస్తున్నదని తెలిపారు. ఐదారేండ్లలోనే అత్యధిక జనాభా పట్టణాల్లో నివసించే అవకాశం ఉంటుందని అంచనావేశారు. కార్పొరేషన్లు, హైదరాబాద్‌ పరిసర మున్సిపాలిటీల కమిషనర్లకు, జిల్లా అదనపు కలెక్టర్లకు బుధవారం ఎంసీహెచ్చార్డీలో నిర్వహించిన రెండ్రోజుల శిక్షణ ముగింపు సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ముందుగా దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా నివాళులర్పించారు. భవిష్యత్‌ అవసరాలకనుగుణంగా పట్టణాల అభివృద్ధి, భవిష్యత్‌ ప్రణాళికలు సిద్ధంచేసుకోవాలని కేటీఆర్‌ ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి పట్టణం 30 ఏండ్ల కాలవ్యవధికి తన అవసరాలు తెలుసుకుని, ప్రణాళికలు సిద్ధంచేసుకోవాలని చెప్పారు. పెరుగుతున్న జనాభాకు అవసరమైన సేవలను అందించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. పరిపాలన వికేంద్రీకరణ అందుకు ఒక సాధనంగా ఎంచుకున్నామని తెలిపారు. 2014 నుంచి ఇప్పటిదాకా పెద్దఎత్తున పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చామని, పురపాలికల సంఖ్యను దాదాపు రెట్టింపు చేసి, 141కి పెంచామని పేర్కొన్నారు.

ఓఆర్‌ఆర్‌ చుట్టూ వేగంగా అభివృద్ధి

రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్నదని, హైదరాబాద్‌ చుట్టు పక్కల పురపాలికల్లో, ముఖ్యంగా అవుటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ అభివృద్ధి పరుగులు పెడుతున్నదని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఈ మేరకు అక్కడ మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి పురపాలిక తన ఆదాయ వనరుల విషయంలో ప్రత్యేక ఆడిట్‌ చేపట్టి, భవిష్యత్‌లో ఆదాయం పెరుగుదలకు వినూత్నమైన నిర్వహణ పద్ధతులను ఎంచుకోవాలని ఆదేశించారు. తాగునీటి నిర్వహణపై పురపాలికలు ప్రత్యేక ప్రణాళిక కలిగి ఉండాలని సూచించారు. ప్రతి పురపాలిక వాటర్‌ ఆడిట్‌ నిర్వహించుకోవాలని.. తద్వారా భవిష్యత్‌ తాగునీటి అవసరాలపై స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రతి పట్టణం ఎనర్జీ ఆడిట్‌ను సిద్ధంచేసుకోవాలని, పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. దీర్ఘకాలిక భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌ చుట్టుపక్కల మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు సమన్వయంతో కలిసి పనిచేయాలని కేటీఆర్‌ సూచించారు. అనంతరం రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి ఒక ప్రత్యేక యాప్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


logo