బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - May 28, 2020 , 03:23:44

పండ్లతోటలతో పండుగే!

పండ్లతోటలతో పండుగే!

  • నికర ఆదాయం వచ్చే పంటలపై దృష్టి
  • కరీంనగర్‌ రైతుకు లక్షల్లో ఆదాయం
  • డ్రాగన్‌ఫ్రూట్‌, బొప్పాయి, కర్బూజ, తర్బూజ, అల్లం సాగు

రైతులు కొత్త పద్ధతుల్లో సాగుచేస్తూ నికర ఆదాయం వచ్చేపంటలపై దృష్టి సారిస్తున్నారు. ఆధునిక పరిజ్ఞానంతో యాజమాన్య పద్ధతులను అవలంబించి తక్కువ పెట్టుబడితో అధిక లాభం, మార్కెట్‌లో విక్రయానికి అనుకూలంగా ఉండే పండ్ల తోటలను పెంచుతున్నారు. కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌ రైతు ద్యావ రాంచంద్రారెడ్డి వినూత్న పంటలను సాగుచేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. డ్రాగన్‌ఫ్రూట్‌, బొప్పా యి, కర్బూజ, తర్బూజ, అల్లం సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు

రామడుగు: రాంచంద్రారెడ్డి తండ్రి ప్రతాపరెడ్డి ఇరవై ఏండ్ల క్రితం ఆరెకరాల్లో మామిడి సాగుచేశారు. పదిహేనేండ్లుగా ఫలం అందుతున్నది. ఈ ఏడాది ఐదు టన్నుల దిగుబడి వచ్చింది. పెట్టుబడిపోను నష్టమే వస్తుండటంతో రాంచంద్రారెడ్డి వినూత్న సాగుకు శ్రీకారం చుట్టారు. డ్రాగన్‌ఫ్రూట్‌ సాగుచేయాలకొన్నారు. ఈ పంటకు తన భూమి అనుకూలమో కాదో తేల్చాలని వ్యవసాయ శాస్త్రవేత్తలను సంప్రదించారు. మట్టి పరీక్షలు నిర్వహించి, భూసారాన్ని కాపాడుకుంటూ ఉద్యాన పంటల సాగుచేపట్టారు. డ్రాగన్‌ఫ్రూట్‌ సాగుపై ఏపీలోని గుంటూరు, రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో శ్రీనివాస్‌రెడ్డి వద్ద రాంచంద్రారెడ్డి మెళకువలు తెలుసుకున్నారు. మొదట గుంటూరు జిల్లా నుంచి ఒక్కో మొక్కకు రూ.70 వెచ్చించి ఎకరాకు సరిపడా 2,100 మొ క్కలు, తర్వాత సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం అలియాబాద్‌ నుంచి మరో ఎకరాకు సరిపడా అమెరికన్‌ బ్యూటీ, సియామ్‌ రెడ్‌, పింక్‌ పర్పుల్‌ రకాల మొక్కలను తెచ్చి 2018లో నాటారు. ఒక్కో స్తంభానికి నాలుగు వైపులా నాలుగు మొక్కలు నాటారు. ఈ మొక్కల నుంచే కొత్త మొక్కలు సృష్టించుకొని మరో అరెకరంలో సాగుచేశారు. మొక్కకు నీరందిచేందుకు డ్రిప్‌ ఏర్పాటుచేశారు. ఎండ నుంచి రక్షణ కోసం షేడ్‌నెట్‌ వేశారు. ఎకరం సా గుకు రూ.6 లక్షల వరకు ఖర్చుచేశారు. ప్రభుత్వం నుంచి ఎంఐడీహెచ్‌ (మిషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌) ద్వారా రూ.1,78,125 సబ్సిడీ వచ్చింది. సేంద్రియ పద్ధతిలో పెరిగిన మొక్కలు ప్రస్తుతం ఫలాలు అందిస్తున్నాయి. జూన్‌, జూలైల్లో వర్షాలతో వాతావరణం చల్లబడితే అధిక ఫలాలు రానున్నాయి. నాటిన ఏడాదిన్న రకు ఫలాలు వస్తాయి. మూడేండ్ల తర్వాత ఎకరాకు 5 నుంచి 6 టన్నులు, నాలుగేండ్లు దాటితే 10 టన్నుల దిగుబడి పొందవచ్చని రాంచంద్రారెడ్డి తెలిపారు. మార్కెట్‌లో డ్రాగన్‌ ఫలాలు హోల్‌సేల్‌ ధర కిలో రూ.150 ఉన్నదని, టన్నుకు రూ.1.5 లక్షలు పలుకుతుందని అంటున్నారు.

ఇతర పంటల్లోనూ వినూత్నం

వినూత్న సాగుపైనే రాంచంద్రారెడ్డి దృష్టిపెట్టారు. గతం లో రెండున్నర ఎకరాల్లో తైవాన్‌ రెడ్‌లేడీ 786 రకం బొప్పాయిని సాగుచేసి రూ.20 లక్షల పంట పండించారు. ఈ వేసవిలో కుందన్‌ రకం తర్బూజ రెండెకరాల్లో సాగుచేయగా 45 టన్నులు, నాలుగెకరాల్లో కర్బూజ వేసి 110 టన్నుల దిగుబడి సాధించారు. ఈ పంటలు 70-80 రోజుల్లో చేతికి రాగా, రూ.10 లక్షలకుపైగా లాభం వచ్చింది. ఆరెకరాల్లో తైవాన్‌ రెడ్‌లేడీ రకం బొప్పాయిని మళ్లీ వేశారు. ఇది ఒక్కోచెట్టుకు 100 నుంచి 120 కిలోల పండ్లను అందిస్తున్నది. వీటితోపాటు అల్లం కూడా సాగు చేస్తున్నారు.

వినూత్న పంటలు వేస్తున్న

మేము ఇదివరకు వరి, మక్క, పత్తి పంటలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాళ్లం. మక్కలో కత్తెర పురుగు, పత్తిలో గులాబీరంగు పురుగు, వరిలో దోమపోటు, అగ్గితెగులు లాంటి విపత్తులతో నష్టాన్ని చూడమే తప్ప లాభాలు రాలేదు. కొత్తరకం పంటల ను వేయాలని డ్రాగన్‌ఫ్రూట్‌ సాగు చేపట్టా. ప్రస్తుతం మొదటిపంటను మార్కెట్‌కు తరలిస్తున్నా. ఆరెకరాల్లోని మామిడితోటను తొలిగించి డ్రాగన్‌ సాగుచేస్తా. ముఖ్యంగా లక్ష్మీపూర్‌లో నీటి సౌలభ్యం తక్కువ ఉం డటం వల్ల డ్రిప్పు పద్ధతిలో పంటసాగు చేస్తున్నా.

- ద్యావ రాంచంద్రారెడ్డి, డ్రాగన్‌ ఫ్రూట్‌ రైతు