ఆదివారం 31 మే 2020
Telangana - May 06, 2020 , 01:48:54

కరోనా ఔషధం తొలి విజయం!

కరోనా ఔషధం తొలి విజయం!

  • వైరస్‌ను నిర్మూలించగల ఐదు ఔషధాలను గుర్తించాం 
  • త్వరలో మనుషులపై ప్రయోగం.. 4 నెలల్లో ఔషధం రెడీ 
  • ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌కు ఔషధాన్ని అభివృద్ధిచేయడంలో తొలి విజయం సాధించామని అమెరికాలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న హైదరాబాదీ డాక్టర్‌ శివరామకృష్ణ తెలిపారు. అమెరికాకు చెందిన ఔఎఫ్‌డీఏ అనుమతించిన ఔషధాల సాయంతో కొంతకాలంగా చేస్తున్న పరిశోధన సఫలమైందని చెప్పారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో 250 రకాల ఔషధాలపై పరిశోధనలు జరుపగా, యాంటీ మలేరియా, యాంటీ ఇమ్యూనిటీ ఔషధాలతోపాటు మరో మూడు డ్రగ్స్‌ ఫలితాన్నిచ్చాయని పేర్కొన్నారు. త్వరలోనే మనుషులపై ప్రయోగిస్తామని, అది కూడా సఫలమైతే మూడు నుంచి నాలుగు నెలల్లో కరోనాకు ఔషధం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి బయో కెమిస్ట్రీలో పీహెచ్‌డీ పూర్తిచేసిన శివరామకృష్ణ ప్రస్తుతం టెక్సాస్‌ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్‌ హ్యూస్టన్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. డల్లాస్‌లో ఈయన ఆధ్వర్యంలోని లింక్స్‌ బయోసైన్స్‌ సంస్థ కరోనాకు ఔషధాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నది. మంగళవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ..

కొత్తరకం వ్యాధిని నయంచేసే మందును రూపొందించటానికి సాధారణంగా పది నుంచి పన్నెండేండ్లు పడుతుందని తెలిపారు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది శాస్త్రవేత్తలు ‘డ్రగ్‌ రీపర్పసింగ్‌' విధానంలో కొవిడ్‌-19కు ఔషధాన్ని తయారుచేయటానికి ప్రయత్నిస్త్తున్నారని చెప్పారు. ఒక వ్యాధికి ఔషధాన్ని కనుగొనే క్రమంలో కొన్ని ఔషధ మిశ్రమాలను తయారుచేస్తారని, కొన్నిసార్లు అవి మరో వ్యాధిని నయం చేసేందుకు ఉపయోగపడుతాయని చెప్పారు. ఇదివరకు ఫైజర్‌ అనేసంస్థ హైపర్‌టెన్షన్‌, మానసిక ఆందోళన నివారించడానికి తయారుచేసిన సిల్డేనాఫిల్‌ అనే ఔషధం విఫలంకాగా, అది వయాగ్రాగా ఉపయోగపడగలదని ఒక శాస్త్రవేత్త నిరూపించారని గుర్తుచేశారు. సార్స్‌, ఎబోలా, హెచ్‌ఐవీ, మెర్స్‌ వ్యాధులకు ఔషధాలను అభివృద్ధిచేసే క్రమంలో చేసిన కొన్ని ఔషధ మిశ్రమాల ద్వారా కరోనాకు మందును రూపొందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. 


logo