‘డాక్టర్ భరత్‌రెడ్డి నెరవట్ల ఇంటర్నల్ మెడిసిన్, న్యూరాలజీ, ఇంటర్వెన్షన్ న్యూరాలజిస్ట్‌గా, న్యూరో క్రిటికల్ కేర్, బ్రెయిన్ స్ట్రోక్ స్పెషలిస్ట్‌గా సుపరిచితులు. మిచిగాన్‌లోని మెక్లారెన్ హెల్త్‌కేర్‌లో ప్రముఖ వైద్యుడిగా దాదాపు 15 దవాఖానాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా సేవలు అందిస్తున్నారు. గాలి ద్వారానూ కరోనా వ్యాపిస్తుందని ఏడాదిక్రితమే చెప్పారాయన.’
వ్యాక్సిన్ వచ్చిందనే ఆకాశమంత నమ్మకం నుంచి కరోనా విజృంభణతో ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోయాం. కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నది. అసలు సెకండ్ వేవ్‌కు కారణాలేంటి? ఎలా ప్రారంభమైంది? దాని ప్రభావం ఎలా ఉంటుంది? దాన్నెలా ఎదుర్కోవాలి? వ్యాక్సిన్ ఎంత వరకు ప్రభావం చూపుతుంది? తదితర అంశాలపై అమెరికాలో ప్రముఖ వైద్యనిపుణుడు, కల్వకుర్తికి చెందిన డాక్టర్ భరత్‌రెడ్డి నెరవెట్ల ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
కరోనా సెకండ్‌వేవ్ విజృంభించడానికి కారణాలేంటి?
ప్రజల నిర్లక్ష్యమే ఎక్కువ. మాస్కులు పెట్టుకోకుండా, భౌతికదూరం పాటించకుండా, ఏమీ కాదని విచ్చలవిడిగా తిరగడమే రెండో వేవ్‌కు ప్రధానకారణం. అమెరికాలోనూ రెండోవేవ్ ఇలాగే వచ్చింది. కరోనాతో మనం సహజీవనం చేయాల్సిందే.
వ్యాక్సిన్ల ప్రభావం ఎలా ఉంటుంది?
పూర్తిస్థాయి కొవిడ్ వ్యాక్సిన్ ఇప్పుడే వచ్చేలా లేదు. ఇప్పుడున్న వ్యాక్సిన్లన్నీ ఆయా వ్యక్తుల్లో ఉండే రోగనిరోధకశక్తి, వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్ల ఆధారంగా పనిచేస్తాయి. వ్యాక్సిన్ వేసుకున్నా మాస్కు ధరించాల్సిందే. పూర్తి రక్షణ అంటే.. వ్యాక్సిన్ వేసుకొన్నా భౌతికదూరం పాటించాలి, మాస్కు ధరించాలి.
అన్ని దేశాల్లో సెకండ్ వేవ్ రాలేదు కదా?
అవును. చైనాలో మొదటి వేవ్ మాత్రమే వచ్చింది. అక్కడ క్రమశిక్షణతో, కచ్చితంగా నిబంధనలు పాటిస్తున్నారు. మాస్క్, భౌతిక దూరం, చేతులకు శానిటైజేషన్ వారి జీవితంలో భాగంగా మారింది కాబట్టే అక్కడ రెండో వేవ్ రాలేదు. అమెరికాలో ప్రస్తుతం థర్డ్ వేవ్ పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కరోనాపై పోరులో విటమిన్ డీ పాత్ర ఎంత?
శరీరానికి కావాల్సినంత విటమిన్ డీ (పెద్దలకు రోజుకు 600 ఇంటర్నేషనల్ యూనిట్లు, పిల్లలకు 400 ఐయూ) తీసుకుంటే సహజంగా రోగనిరోధకశక్తి ఉంటుంది. కరోనా సోకినవాళ్లు 1000-4000 ఐయూ మోతాదులో విటమిన్ డీ తీసుకోవాలి. ఇది కరోనా వైరస్‌తో పోరాడేలా చేస్తుంది.
జింక్ కూడా ముఖ్యమే.
మన దేశంలోనూ మూడో వేవ్‌కు అవకాశం ఉందంటారా?
వ్యాక్సిన్ వేసుకున్నా మాస్క్‌లు, భౌతిక దూరం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం లాంటివి పాటిస్తూ, లాక్డౌన్, కర్ఫ్యూ లాంటివి ప్రభుత్వాలు చేపడితే మరో వేవ్ వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. లేకపోతే వైరస్ మ్యూటేషన్లు, వేరియంట్లు మరింత ఇబ్బంది పెట్టవచ్చు. మూడో వేవ్ రావాలా? వద్దా? అనేది మన చేతుల్లోనే ఉంది.