శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 03:06:13

బలహీన వైరస్‌తో మరణాల్లో తగ్గుదల

బలహీన వైరస్‌తో మరణాల్లో తగ్గుదల

  • ఎప్పటికప్పుడు వైరస్‌లో జన్యు మార్పు
  • అధిక ఉష్ణోగ్రత ప్రాంతాల్లోనూ విజృంభణ
  • మూసిన గదుల్లో వ్యాప్తి 5 రెట్లు ఎక్కువ
  • ‘నమస్తే తెలంగాణ’తో అమెరికాలో డాక్టర్‌ భరత్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ శీతల ప్రాంతాల్లోనే విజృంభిస్తుంది.. ఎండలు ఎక్కువుండే ప్రదేశాల్లో జీవించలేదనేది మొదట్లో శాస్త్రవేత్తలు, వైద్య నిపుణుల అంచనా ఇది. కానీ, వైరస్‌ జన్యుక్రమాన్ని మార్చుకుంటూ ఎండలు మండే ప్రాంతాల్లోనూ కల్లోలం సృష్టిస్తున్నది. భారత్‌తోపాటు వేడి ఎక్కువ ఉండే దేశాల్లోనూ కొవిడ్‌-19 కేసులు పెరిగేందుకు వైరస్‌లో జన్యుమార్పులే కారణమని నిపుణులు చెప్తున్నారు. ఇందులోభాగంగా వైరస్‌ బలహీనపడుతున్నదని అమెరికాలో ఉంటున్న కల్వకుర్తికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ భరత్‌రెడ్డి నెరవెట్ల అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే మరణాల రేటు తక్కువగా ఉంటున్నదని చెప్పారు. ఇంటర్నల్‌ మెడిసిన్‌, న్యూరాలజీ, ఇంటర్‌వెన్షనల్‌ న్యూరాలజీ, న్యూరో క్రిటికల్‌ కేర్‌, బ్రెయిన్‌ స్ట్రోక్‌ స్పెషలిస్ట్‌గా డాక్టర్‌ భరత్‌రెడ్డి అమెరికాలోని మిషిగాన్‌లో సుప్రసిద్ధులు. అమెరికాలోని 15 దవాఖానల్లో కరోనా వ్యాధిగ్రస్థులకు వైద్య సేవలు అందించారు. ఆయనతో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేకంగా మాట్లాడింది.తొలుత అమెరికాలో 10 శాతం ఉన్న మరణాల రేటు ప్రస్తుతం 1.5 శాతానికి పడిపోయిందని గుర్తుచేశారు. గతంలో వచ్చిన అనేక వ్యాధులను పరిశీలిస్తే.. మొదట్లో చాలా తీవ్రంగా ఉండే వైరస్‌లు.. క్రమంగా బలహీనమైనట్టు తెలుస్తున్నది. ఇప్పుడు కరోనా వైరస్‌కు కూడా ఇదే వర్తిస్తుందని భరత్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం వైరస్‌ బలహీనపడటంతో ఇప్పుడు లక్షణాలు లేకుండా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పారు. ఇవన్నీ కొంత సానుకూలాంశాలేనని అభిప్రాయపడ్డారు. పబ్‌లు, సినిమాహాళ్లు, షాపింగ్‌మాల్‌లు, ఆఫీసులు వంటి మూసిఉండే ప్రదేశాల్లో (క్లోజ్డ్‌ రూముల్లో ) బృందాలుగా ఉంటే వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంటుందని చెప్పారు. బహిరంగ ప్రదేశాల పోల్చితే.. మూసిఉండే ప్రదేశాల్లో బృందాలుగా ఉండటం వల్ల కరోనా వైరస్‌ వ్యాప్తికి 500 శాతం ఎక్కువగా అవకాశం ఉంటుందని అంచనా వేశారు.  logo