ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 03:46:31

కరోనా బాధితుడికి లంగ్స్‌ మార్పిడి

కరోనా బాధితుడికి లంగ్స్‌ మార్పిడి

  • సర్కోయిడోసిస్‌కు తోడైన కొవిడ్‌- 19
  • విజయవంతంగా శస్త్రచికిత్స చేసిన కిమ్స్‌
  • కోలుకొని డిశ్చార్జి అయిన పంజాబ్‌వాసి

బేగంపేట: సికింద్రాబాద్‌ కిమ్స్‌ దవాఖాన వైద్యులు కరోనా బాధితుడి ఊపిరితిత్తులను విజయవంతంగా మార్చారు. ప్రముఖ వైద్యులు డాక్టర్‌ సందీప్‌ అట్టావర్‌ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స నిర్వహించారు. దీంతో బాధితుడు కోలుకొని డిశ్చార్జి కూడా అయ్యారు. దేశంలోనే తొలిసారిగా కిమ్స్‌లోనే కరోనా పాజిటివ్‌ రోగికి ఊపిరితిత్తులను మార్పిడిచేసినట్టు వైద్యులు తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ దవాఖాన వైద్యులు శస్త్రచికిత్స వివరాలను మీడియాకు వెల్లడించారు. పంజాబ్‌కు చెందిన రిజ్వాన్‌ (32) ఊపిరితిత్తులకు సర్కోయిడోసిస్‌ (క్షయవ్యాధిని పోలిన కంతులు) రావడంతో అవి తంతీకరణం చెందడం మొదలైందన్నారు. రోగికి కరోనా సోకడంతో ఊరిపితిత్తులు మరింత దెబ్బతిన్నాయని, దీంతో బాధితుడి ఆరోగ్యం వేగంగా క్షీణించసాగిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితులలో రెండు ఊపిరితిత్తులను మార్చడమే ఏకైక పరిష్కారమని నిర్ధారణకు వచ్చినట్లు పేర్కొన్నారు. కోల్‌కతాలో బ్రెయిన్‌డెడ్‌ అయిన ఓ వ్యక్తి ఊపిరితిత్తులు అదృష్టవశాత్తు ఇతనికి సరిపోయాయని, వాటిని వెంటనే విమానంలో తీసుకొచ్చి రిజ్వాన్‌కు అమర్చామని వివరించారు. సరైన సమయానికి రెండు ఊపిరితిత్తులు అమర్చడం వల్ల బాధితుడిని కాపాడగలిగామన్నారు. డిశ్చార్జి అయినప్పటికీ, అతడిని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలని, ఈ తరహా రోగులు ఏమాత్రం అనారోగ్యం బారిన పడినా, పోషకాహార లోపం తలెత్తినా ఫలితాలు సరిగా ఉండవని తెలిపారు. బాధితుడిని బయో టేబుల్‌ వాతావరణంలో ఉంచి కనీసం ఆరు వారాలు మందులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.logo