బుధవారం 03 జూన్ 2020
Telangana - May 21, 2020 , 01:17:44

దసరాకు గృహప్రవేశాలు

దసరాకు గృహప్రవేశాలు

  • హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్రూం ఇండ్లు 80 శాతం పూర్తి
  • త్వరలో లక్ష ఇండ్లు సిద్ధం
  • ఆగస్టునాటికి 50వేల మంది లబ్ధిదారులకు పంపిణీ
  • ఉన్నతస్థాయి సమీక్షలో పురపాలక మంత్రి కేటీఆర్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం 80 శాతం పూర్తయిందని.. ఆగస్టునాటికి 50వేల ఇండ్లను లబ్ధిదారులకు అందజేస్తామని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష డబుల్‌ బెడ్రూం ఇండ్ల లక్ష్యం త్వరలో పూర్తవుతుందని.. దసరా నాటికి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణంపై బుధవారం ఎంసీఆర్‌హెచ్చార్డీలో గృహనిర్మాణశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని.. హైదరాబాద్‌లో లక్ష ఇండ్ల నిర్మాణం వేగంగా జరుగుతున్నదని తెలిపారు. ఆగస్టు నాటికి 50వేల మంది లబ్ధిదారులకు ఇండ్లను అందజేస్తామన్నారు. లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ నిర్మాణ పనులు నిరంతరం కొనసాగుతున్నాయని వర్కింగ్‌ ఏజెన్సీలు తెలిపాయి. స్టీలు, సిమెంట్‌, ఇసుక వంటి అంశా ల్లో కొన్ని ఇబ్బందులుఉన్నాయని మంత్రుల దృష్టికి తీసుకొచ్చాయి. వీటిపై ఏజెన్సీలకు ప్రభు త్వం సహాయకారిగా ఉంటుందని, ఈ మేరకు ఆయా కంపెనీలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటుచేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో మిగిలిన పనులను త్వరగా పూర్తిచేయాలని చెప్పారు. నిర్మాణాలు పూర్తయినచోట మౌలిక వసతుల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇండ్లను వెంటనే ఆధీనంలోకి తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. డబుల్‌ ఇండ్లను అధికభాగం హైదరాబాద్‌లో నిర్మిస్తున్నట్టు మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. వాటి నిర్మాణంలో నగరపాలక సంస్థకు తమశాఖ తరఫున పూర్తి సహాయసహకారాలు అందిస్తామని చెప్పారు. 

వేగంగా ఇండ్ల నిర్మాణం: తలసాని

హైదరాబాద్‌లో డబుల్‌ ఇండ్ల నిర్మాణం వేగంగా సాగుతున్నదని మంత్రి తలసాని తెలిపారు. సమీక్ష అనంతరం ఆయన మాట్లాడారు. నగరంలో 10 వేల మంది లబ్ధిదారులకు డబుల్‌ ఇండ్లను అందించామని చెప్పారు. సమావేశంలో గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి చిత్రా రామచంద్రన్‌, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, జలమండలి ఎండీ దానకిశోర్‌ పాల్గొన్నారు.

ఉచిత క్వారంటైన్‌ వసతి కల్పించండి

కరోనా నేపథ్యంలో గల్ఫ్‌ దేశాలనుంచి తెలంగాణ వస్తున్నవారికి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత క్వారంటైన్‌ వసతి కల్పించాలని మంత్రి కేటీఆర్‌కు టీఆర్‌ఎస్‌ ఎన్నారై ఖతార్‌శాఖ అధ్యక్షుడు శ్రీధర్‌ అబ్బగౌని బుధవారం వినతిపత్రం సమర్పించారు. గల్ఫ్‌లో ఉన్న వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని భారత్‌కు రావడానికి కేంద్రప్రభుత్వం ఉచిత విమాన టికెట్‌ సౌకర్యం కల్పించేలా చూడాలని మంత్రిని కోరారు.


logo