శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 27, 2020 , 03:32:19

సలీంకు ఇల్లు దక్కింది..

సలీంకు ఇల్లు దక్కింది..

  • కేసీఆర్‌ మాటిచ్చారు.. కేటీఆర్‌ నెరవేర్చారు 
  • గోల్కొండవాసి మహ్మద్‌ సలీంకు డబుల్‌ బెడ్రూం పట్టా
  • ఆనందం.. అర్ణవమైతే..

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఇచ్చిన మాటను నెరవేర్చడంలో.. హామీలను తీర్చడంతో టీఆర్‌ఎస్‌ సర్కారు తర్వాతే ఎవరైనా. ఒక దివ్యాంగుడైన వృద్ధుడికి సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని నెరవేర్చిన ప్రభుత్వం మరోసారి భేష్‌ అనిపించుకున్నది. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ఫిబ్రవరి 27న టోలిచౌకీలో జరిగిన ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి ముఖ్యమంత్రి  కే చంద్రశేఖర్‌రావు హాజరై ప్రగతిభవన్‌కు బయలుదేరారు. కాన్వాయ్‌ టోలిచౌకి సమీపంలోకి రాగానే అక్కడ ైప్లెఓవర్‌కు సమీపంలో మహ్మద్‌ సలీం అనే దివ్యాంగ వృద్ధుడు  రోడ్డుపక్కన కాగితాలు పట్టుకొని సీఎం కేసీఆర్‌ వైపు దీనంగా చూస్తూ ఏదో చెప్పాలని ప్రయత్నించారు. ఇది గమనించిన సీఎం కాన్వాయ్‌ను ఆపి సలీంను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని ఆయన సమస్యలేంటో తెలుసుకున్నారు. 

తాను గతంలో డ్రైవర్‌గా పనిచేశానని, అల్సర్‌తో బాధపడుతున్నానని, నాలుగేండ్ల క్రితం బిల్డింగ్‌ పైనుంచి పడ్డానని ఎడమకాలు తుంటి ఎముక విరిగిందని సలీం చెప్పారు. తన కొడుకు ఆరోగ్యం కూడా బాగా లేదని తగిన సహాయం చేయాలని కోరారు. తనకు సర్టిఫికెట్‌ ఉన్నా వికలాంగ పింఛన్‌ ఇవ్వడంలేదని, ఓ బ్రోకర్‌ పింఛన్‌ ఇప్పిస్తానని మోసం చేశాడని, అద్దె ఇంట్లో ఉంటున్న తనకు డబుల్‌ బెడ్రూం ఇంటితో పాటు, రేషన్‌కార్డు, వైద్యం కోసం ఆరోగ్యశ్రీ కార్డులను మంజూరుచేయాలని కోరారు. సలీం సమస్యలను సావధానంగా విన్న సీఎం ఆయనకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు మంజూరు చేస్తానని  హామీనిచ్చారు. సీఎం ఆదేశాలతో జిల్లా కలెక్టర్‌ శ్వేతామహంతి సహా ఇతర అధికారులు అదేరోజు గోల్కొండ మోతీమహల్‌లోని సలీం ఇంటికెళ్లి వికలాంగ పింఛన్‌ను మంజూరుచేసి రెండునెలల పింఛన్‌ను అక్కడికక్కడే అందజేశారు. జియాగూడలో డబుల్‌ బెడ్రూం ఇంటిని మంజూరుచేశారు. జియాగూడలో సోమవారం మంత్రి కే తారకరామారావు మొట్టమొదటగా మహ్మద్‌ సలీంకు డబుడ్‌ బెడ్రూం ఇంటి తాళాలను అందజేశారు. 

వాదా నిభాయే 

‘నేను మా కుటుంబం తెలంగాణ సర్కారు, ముఖ్యమంత్రి కేసీఆర్‌లకు ఆజన్మాంతం రుణపడి ఉంటాం. ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకున్నారు. పేదల సంక్షేమాన్ని కాంక్షించే ఇలాంటి ప్రభుత్వం అవసరం. ఇలాంటి ప్రభుత్వంతోనే సమస్యలు తీరుతాయి. నేనిప్పుడు నెలకు రూ. 8 వేలు కిరాయి కడుతున్నా. వికలాంగుడినైన నాకు అంత కిరాయి కట్టే స్థోమతలేదు. ఇప్పుడు డబుల్‌ బెడ్రూం ఇంటిని ఇవ్వడంతో కిరాయి కట్టే తిప్పలు తప్పనున్నాయి. ఇప్పుడు నెలకు రూ. 3,116 పింఛన్‌ వస్తున్నది. మా సమస్యలు తీరాయి. తలదాచుకోవడానికి ఇళ్లు వచ్చింది. పూట గడవడానికి ఫించన్‌ వచ్చింది’ 

- మహ్మద్‌ సలీం, లబ్ధిదారుడు