e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home తెలంగాణ కట్లతో వచ్చేవాళ్లను నమ్మొద్దు

కట్లతో వచ్చేవాళ్లను నమ్మొద్దు

  • బీజేపీ నాయకులతో తస్మాత్‌ జాగ్రత్త
  • పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండండి
  • ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ విజ్ఞప్తి

కమలాపూర్‌, ఆగస్టు 4: రాబోయే హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో కాళ్లకు కట్లు కట్టుకుని ఓట్లు అడిగేందుకు వస్తరు.. అయ్యో పాపం అనకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ బీజేపీ నేత ఈటల రాజేందర్‌ను ఉద్దేశించి అన్నారు. బుధవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలంలోని శ్రీరాములపల్లి, వంగపల్లి, మర్రిపెల్లిగూడెంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం దళిత కాలనీల్లో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్‌ మాట్లాడుతూ.. ఏడేళ్లు మంత్రిగా ఉన్న ఈటల నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశాడన్నారు. నమ్మి ఓట్లు వేసినందుకు వాళ్లు బాగుపడ్డరు తప్ప ఊర్లు బాగుపడలేదని చెప్పారు. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూ కాళ్లకు కట్లు కట్టుకుని వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. దుబ్బాక ఎన్నికల సమయంలో రఘునందన్‌రావు చేతికి కట్టు కట్టుకుని ఓట్లు కాగానే కట్టు విప్పేసిన సంగతిని గుర్తుచేశారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఎవరు, ఏ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందో ఆలోచించాలని కోరారు.

ఎస్సీల ఆర్థికాభివృద్ధి కోసమే దళితబంధు
సామాజిక వివక్ష ఎదుర్కొంటున్న దళితుల అభ్యున్నతి కోసం ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని బాల్క సుమన్‌ స్పష్టంచేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు దాటినా ఏ ప్రభుత్వం దళితుల కోసం ఆలోచించలేదని.. తెలంగాణ ప్రభుత్వం ఏడేండ్లలోనే దళితుల కోసం రూ.55,438 కోట్లు ఖర్చు పెట్టిందని వెల్లడించారు. దళితులు ఆర్థికాభివృద్ధి కోసం కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని చెప్పారు. ఈ నెల 16న హుజూరాబాద్‌ శాలపల్లి వద్ద దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్‌ లాంఛనంగా ప్రారంభిస్తారని, ఈ సభకు దళితులు ఇండ్లకు తాళాలు వేసి ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపేందుకు భారీగా తరలిరావాలని కోరారు. ఈ సందర్భంగా శంభునిపల్లి, దేశరాజ్‌పల్లి, వంగపల్లి, కమలాపూర్‌, మాదన్నపేట, లక్ష్మీపురం గ్రామాలకు చెందిన కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు, కార్యకర్తలు బాల్కసుమన్‌, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్‌చార్జి పేర్యాల రవీందర్‌రావు, సర్పంచ్‌లు కే విజేందర్‌రెడ్డి, పీ కమలమ్మ, కిరణ్మయి, గోపాల్‌, ఎంపీటీసీ రామస్వామి, పీఏసీఎస్‌ చైర్మన్‌ సంపత్‌రావు, వైస్‌ చైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana