శనివారం 16 జనవరి 2021
Telangana - Dec 22, 2020 , 01:59:09

డబుల్‌ ఇండ్లను విక్రయిస్తే ఊరుకోం

డబుల్‌ ఇండ్లను విక్రయిస్తే ఊరుకోం

  • ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు 
  • లబ్ధిదారులకు కొత్త దుస్తులు, పట్టాల పంపిణీ

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: డబుల్‌ బెడ్రూం ఇండ్లను పొందిన వారు వాటిని అమ్మినా, కిరాయికిచ్చినా ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. సోమవారం సిద్దిపేట కేసీఆర్‌ నగర్‌లో లబ్ధిదారులకు మంత్రి హరీశ్‌రావు దంపతులు నూ తన దుస్తులు పెట్టి, ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్ల పేదల కల నెరవేరినందుకు తనకు చాలా సంతోషంగా ఉన్నదన్నారు. పేదల ముఖాల్లో ఆనందం చూస్తుంటే, బిర్యాని తిన్న భావన కలిగిందన్నారు. సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో 2,460 ఇండ్లను నిర్మించామన్నారు. మొదటి దశలో 1341 మంది లబ్ధిదారులను గుర్తించినట్టు చెప్పారు. ఇండ్ల కేటాయింపులో రాజకీయ జోక్యం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, 200 మంది అధికారులు అహర్నిశలు శ్రమించారని తెలిపారు. ఎవరైనా పైసా లంచం ఇచ్చినట్టు చెబితే, వారికి రూ.10 వేల బహుమానం ఇస్తామని మం త్రి తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, ఎంసీఆర్‌హెచ్‌డీ సీనియర్‌ ఫ్యాకల్టీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. 

సిద్దిపేటలో ఎంసీఆర్‌హెచ్‌డీ ప్రాంతీయ కేంద్రం ప్రారంభం

డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ తొలిసారిగా ప్రాంతీయ శిక్షణ కేంద్రాన్ని సిద్దిపేట డిగ్రీ కళాశాలలో సోమవారం ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌తో కలిసి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ  సిద్దిపేటలో తన ప్రాంతీయ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ హరిప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ.. సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి పాల్గొన్నారు.