మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 15:28:42

కరోనా అంటే.. నిర్లక్ష్యం వద్దు.. : మంత్రి హరీశ్‌రావు

కరోనా అంటే.. నిర్లక్ష్యం వద్దు.. : మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట : కరోనా అంటే నిర్లక్ష్యం వద్దనీ, భయపడొద్దని.. పూర్తి జాగ్రత్తతో ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. గురువారం సిద్దిపేట మున్సిపల్‌ పరిధిలోని ఆరో వార్డులో రూ.2.20కోట్ల వ్యవయంతో నిర్మించనున్న సీసీరోడ్ల నిర్మాణ పనులను మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా పాజిటివ్‌ వస్తే ఏదో తప్పు చేసిన వారిలా చిన్నచూపు చూడకుండా ప్రేమ చూపాలన్నారు.

వైరస్‌ సోకాలని ఎవరూ కోరుకోరని, అందరూ జాగ్రత్త పడుతూ.. మన జాగ్రత్తలో మనం ఉండాలని సూచించారు. వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన వారు మానసికంగా బాధపడుతుంటారని, సూటిపోటి మాటలతో ఇంకా కుంగిపోయి బలహీనపడుతున్నారని చెప్పారు. ఎవరికీ వైరస్‌ సోకొద్దని కోరుదాం.. వచ్చిన మనిషికి ధైర్యం చెప్పాలని, దీంతో రెండు రోజులు ఎక్కువ బ్రతికే అవకాశం ఉంటుందన్నారు. ఇలా పలు చోట్ల జరిగిన జరిగిన విషయాలు తన దృష్టికి వచ్చాయని మంత్రి తెలిపారు. ప్రజలు అవసరమైతే తప్పితే ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించారు.

ఉదయం.. మధ్యాహ్నం భోజనం వేళ అన్ని సమయాల్లో గోరు వెచ్చని నీళ్లు తాగితే సగం ఫికర్‌ తగ్గుతుందన్నారు. పసుపు, మిరియాలు వేసి ముఖానికి ఆవిరి పట్టుకోవాలని, రోజుకు రెండు మూడు సార్లు చేయాలని, నిమ్మరసం తాగాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా మనల్ని మనం రక్షించుకున్న వారమవుతామంటూ సూచనలు చేశారు. ఈ నెల 15న కరోనా పరీక్షా కేంద్రం ప్రారంభిస్తామని, వంద మందికి సేవలందించేలా కొవిడ్‌ ఆసుప్రతి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 20 పడకలతో ఐసీయూ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. 

ప్రభుత్వ యునాని దవాఖాన ప్రారంభం..

పట్టణంలోని 26వ మున్సిపల్ వార్డులో రూ.15 లక్షల వ్యయంతో కాలనీ కమ్యూనిటీ హాల్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు  మంత్రి భూమిపూజ చేశారు. అనంతరం రూ.15 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన ప్రభుత్వ యునాని దవాఖానను ప్రారంభించారు. ప్రభుత్వ యునాని దవాఖానకు అవసరమైన అంశాలపై చర్చిస్తూ.. త్వరితగతిన ఆమోదం ఇవ్వాలని ఫోన్ లైనులో ఉన్నతాధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo