మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 17, 2020 , 06:54:00

ఆ వాహనాలకు గడువు పరిమితి వద్దు

ఆ వాహనాలకు గడువు పరిమితి వద్దు

హైదరాబాద్ : అన్నదాతలకు వెన్నుదన్నుగా ఉండే ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ వాహనాలను 31లోగా రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలంటూ.. రవాణాశాఖ అధికారులు గడువు విధించడం తగదని తెలంగాణ రాష్ట్ర ట్రాక్టర్‌ డీలర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వీవీ రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధాన కార్యదర్శి పీఎస్‌ శేఖర్‌, కార్యవర్గ సభ్యులు జె. సుధాకర్‌రెడ్డితో కలిసి మాట్లాడారు.  ఇటీవల ఆర్టీఏ అధికారులు మార్చి 31లోగా రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలని, లేని పక్షంలో స్క్రాప్‌గా గుర్తిస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. 

భారత ప్రభుత్వ రహదారులు, రవాణా మంత్రిత్వ శాఖ బీఎస్‌-6 నిబంధనలను వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలులోకి తీసుకువస్తున్నదని, అయితే మోటార్‌ వెహికిల్‌ రూల్‌ 115లోని టూ వీలర్స్‌, త్రీ వీలర్స్‌, ఫోర్‌ వీలర్స్‌ ఎం అండ్‌ ఎన్‌ కేటగిరీ వాహనాలకు మాత్రమే వర్తిస్తుందన్నారు. రూల్‌ 115ఏ ప్రకారం ట్రాక్టర్స్‌, నిర్మాణరంగ, వ్యవసాయరంగ వాహనాలైన కంబైన్డ్‌ హార్వేస్టర్‌, పవర్‌ టిల్లర్స్‌కు వర్తించదన్నారు. ఇదే విషయమై ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం అక్కడి అన్ని రవాణాశాఖ కార్యాలయాలకు సర్క్యూలర్‌ జారీ చేసిందన్నారు. రూల్‌ 115ఏను ‘హ్యాండ్‌ బుక్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ లా ఇన్‌ తెలంగాణ’లో స్పష్టంగా రాశారని,  తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ కె. పాపారావు ద్వారా రివైజ్‌ కూడా చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులు ఉపయోగించే ట్రాక్టర్లపై రూ.126కోట్ల పన్నులను ఎత్తివేసిందని గుర్తు చేశారు. రిజిస్ట్రేషన్‌ విషయంలోనూ జోక్యం చేసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరారు.


logo
>>>>>>