శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 16, 2020 , 01:41:02

వానకాలంలో మక్కపై మక్కువొద్దు

వానకాలంలో మక్కపై మక్కువొద్దు

-వ్యవసాయ నిపుణుల వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వానకాలంలో మక్కజొన్న పంట సాగుతో లాభాల కంటే నష్టాలే అధికమని వ్యవసాయరంగ నిఫుణులు సూచిస్తున్నారు. వానకాలంలో అధిక వర్షాల కారణంగా జొన్నమొక్క ఏపుగా పెరిగి, భూమిలోని సారాన్నంతా లాగేస్తుందని.. దీంతో గింజ కట్టినతర్వాత కంకికి బూజు వస్తున్నదని చెప్తున్నారు. ఈ కారణంగా దిగుబడి తగ్గడంతోపాటు, పంటను పౌల్ట్రీ పరిశ్రమలో వినియోగించడానికి కూడా పనికిరాదని వివరిస్తున్నారు. బూజుపట్టిన మక్కలతో క్యాన్సర్‌ సోకే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. యాసంగిలో నీటిశాతం తక్కువగా ఉండటంతో మొక్క ఆరోగ్యంగా పెరిగి, అధిక దిగుబడి వస్తుందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. పంటను యాసంగిలో మాత్రమే పండించడంవల్ల పౌల్ట్రీ పరిశ్రమ నుంచి కూడా డిమాండ్‌ ఉంటుందని, దీనివల్ల  రైతులకు మంచిధర లభిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో 2018-19 వానకాలం, యాసంగి సీజన్‌లో 13.57 లక్షల ఎకరాల్లో మక్కలు సాగుచేయగా.. 20.83 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. 2019-20 వానాకాలం సీజన్‌లో కత్తెర పురుగు ప్రభావంతో దిగుబడులు భారీగా తగ్గి, పెట్టిన పెట్టుబడులు కూడా లభించని పరిస్థితిని రైతులు ఎదుర్కొన్నారని నిపుణులు పేర్కొంటున్నారు.

18న సీఎం కేసీఆర్‌ వీడియోకాన్ఫరెన్స్‌ 

సమగ్ర వ్యవసాయ విధానం, నియంత్రిత పద్ధతిలో పంటలు సాగుచేసే విధానాలపై గ్రామస్థాయి అధికారులు, రైతుబంధు సమితు ప్రతినిధులతో చర్చించడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ నెల 18న మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తారని అధికారవర్గాలు తెలిపాయి. ఈ మెగా వీడియోకాన్ఫరెన్స్‌ శుక్రవారమే నిర్వహించ తలపెట్టినప్పటికీ వాయిదాపడింది. రైస్‌మిల్లర్లతో చర్చలు అసమగ్రంగా ముగియడం, ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేయాలనే విషయం పై తుదినిర్ణయం తీసుకోకపోవడంతో శుక్రవారం జరుగాల్సిన వీడియోకాన్ఫరెన్స్‌ 18వ తేదీకి మారినట్టు తెలిసింది.logo