గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 13:28:02

సోషల్‌ మీడియాలో ఇలాంటివి నమ్మకండి

సోషల్‌ మీడియాలో ఇలాంటివి నమ్మకండి

హైదరాబాద్‌ : చదువుకున్నవారు గోడలపై యూరిన్‌ పోస్తే చదువురాని వారు వాటిని శుభ్రం చేస్తున్నారు. చదువుకున్న వారి ప్రవర్తనలు ఏ విధంగా ఉన్నాయో తెలిపిన జీహెచ్‌ఎంసీ వాల్‌ రైటింగ్‌ మనందరికి గుర్తుండే ఉంటుంది. చదువు... ఉద్యోగం కోసమే అనుకుంటారు చాలామంది. కానీ మంచి-చెడుల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకునేందుకు చదువు ఉపయోగపడుతుంది. జ్ఞానానికి దారితీసేదే చదువు అంటారు పెద్దలు. అటువంటిది ఇప్పుడు చదువుకున్నవారితోనే సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. వారి వల్లే అసత్యాలు ప్రచారమౌతున్నాయి. కొంతమంది సోషల్‌ మీడియా వేదికగా అభూత కల్పనలను, అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో ఒకరకమైన చర్చను కల్పిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారు. చదువుకుని కూడా కనీసం సోయి లేకుండా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో చెత్తా చెదారాన్ని షేర్‌ చేస్తున్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ జాగ్రత్త చర్యలు తీసుకుంటుండగా.. మరోవైపు కొందరు వాటిని వక్రీకరిస్తూ అసత్య ప్రచారాలకు పూనుకుంటున్నారు. ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తి చేస్తే ఇప్పుడున్న చట్టాల ప్రకారం కనీసం ఒక సంవత్సరం జైలుశిక్ష పడుతుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ అదేవిధంగా అవగాహన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జనతా కర్ఫ్యూ పాటిస్తూ ప్రజలెవరూ ఇండ్ల నుంచి బయటకు రాకుడదని పేర్కొన్నారు. దీన్ని కొంతమంది మరోలా ప్రచారం చేశారు. హెలికాప్టర్లు, విమానాల నుంచి రసాయనాలు చల్లుతున్నరని అందుకే పౌరులెవరూ బయటకు రావొద్దన్నట్లుగా ప్రచారం చేశారు. ఇది అంతటా చర్చనీయాంశమైంది. ఇటువంటి పలు తప్పుడు అంశాలు సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. వాస్తవంగా అవి ఈ విధంగా ఉన్నాయి.  

- రష్యాలో రోడ్ల మీద సింహాలను వదలలేదు

- హెలికాప్టర్ల ద్వారా క్రిమిసంహారక మందులు స్ప్రే చేయడం లేదు

- కరోనా వైరస్‌ భారత్‌ నుండి వెనక్కి వెళ్లిపోయిందని నాసా శాస్త్రవేత్తలు చెప్పలేదు

- ప్రధాని మోదీ రూ.400 టాక్‌టైం ఉచితంగా ఇవ్వడం లేదు

-  కరోనా వైరస్‌కు వాక్సిన్‌ ఇంకా లభ్యం కావడం లేదు.


logo