ఆదివారం 07 జూన్ 2020
Telangana - Mar 29, 2020 , 00:09:11

ఆపన్నహస్తం

ఆపన్నహస్తం

  • లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు దాతల అండ
  • వలసకూలీలకు బియ్యం పంపిణీ  
  • ఉపాధి కోల్పోయినవారికి ఆర్థికసాయం
  • కరోనా కట్టడికి మాస్క్‌ల వితరణ 

నమస్తేతెలంగాణ నెట్‌వర్క్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి దాతలు ఆపన్నహస్తం అందిస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వలస వచ్చి లాక్‌డౌన్‌ కారణంగా ఇక్కడ చిక్కుకున్న కుటుంబాలకు బియ్యంతోపాటు ఆర్థికంగా సాయపడుతూ అండగా నిలుస్తున్నారు. వైరస్‌ వ్యాప్తిని నివారించేందకు ప్రభుత్వ పిలుపు మేరకు ఇండ్లకే పరిమితమైన వారికి నిత్యావసరాలను అందిస్తూ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపారులు బాసటగా నిలుస్తున్నారు. 

పేదలకు ఎమ్మెల్యే కోరుకంటి ఆసరా

బతుకుదెరువుకు పెద్దపల్లి జిల్లా రామగుండానికి వచ్చి.. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇండ్లకే పరిమితమైన తెల్లరేషన్‌ కార్డులేని నిరుపేదలు, కూలీలకు స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ బాసటగా నిలుస్తున్నారు. విజయమ్మ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత భోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, శనివారం ఖనిలోని ఫైవ్‌ ఇన్‌క్లయిన్‌ సమీపంలో దాదాపు 300 కుటుంబాలకు ఇంటింటికీ 5 కిలోల బియ్యం, 2 కిలోల పప్పు పంపిణీ చేశారు. గోదావరిఖని ప్రభుత్వ ఏరియా దవాఖానలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.  

యూపీ వాసులకు ఎమ్మెల్యే పెద్ది సాయం

ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి నర్సంపేటకు వచ్చిన వలస కుటుంబాలకు శనివారం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆర్థిక సాయం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పది కుటుంబాల వారు నర్సంపేటకు వచ్చి కూలీ పనులు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేక తిండికి తిప్పలు పడుతున్నారు. సాయం కోరుతూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చారు. దీంతో  క్వింటాల్‌ బియ్యం, రూ.5 వేలు నగదు అందించారు. దీంతోపాటు వారికి కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.  

వలస కూలీలకు నిత్యావసర సరుకులు.. 

మామిడికాయల ఎగుమతి, ప్యాకింగ్‌ కోసం మధ్యప్రదేశ్‌ నుంచి జగిత్యాల మండలం చల్‌గల్‌కు వచ్చిన 85 మంది వలస కూలీల ఆకలి తీర్చారు రెడ్‌క్రాస్‌, రోటరీ క్లబ్‌ సభ్యులు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వీరికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, సబ్బులు, బిస్కెట్లతో కూడిన సంచులను పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో నివాసముంటున్న వలస కార్మికులకు టీఆర్‌ఎస్‌ యువజన విభాగం నేతలు మహమూద్‌, అశోక్‌, రఫీయొద్దీన్‌, నరేష్‌, కృష్ణ సాయం చేశారు. వివిధ రాష్ర్టాలకు చెందిన కార్మికులకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు.  

కిరాణ వర్తక సంఘం చేయూత 

కరోనా నియంత్రణకు పెద్దపల్లి కిరాణ వర్తక సంఘం నాయకులు శనివారం జిల్లాకేంద్రంలో ప్రజలు, ప్రయాణికులకు నాలుగు వేల మాస్కులు పంపిణీ చేశారు. ఆ సంఘం నాయకులు అల్లెంకి సురేశ్‌, కేశెట్టి రవీందర్‌, ఇల్లందుల కృష్ణమూర్తి, యాద శ్రీనివాస్‌, వాటర్‌ప్లాంట్‌ జయ్‌పాల్‌రెడ్డి, సయీద్‌ కలిసి రూ.20వేల విలువైన మాస్కులను కౌన్సిలర్‌ కృష్ణమూర్తి చేతుల మీదుగా ప్రజలకు పంపిణీ చేశారు. రవాణా వ్యవస్థ స్తంభించి పోయి మధ్యప్రదేశ్‌లోని ఆమ్లాయి గ్రామానికి సైకిళ్లపై బయలుదేరిన కూలీలకు కాగజ్‌నగర్‌లో మాజీ కౌన్సిలర్‌ వెన్న కిశోర్‌బాబు భోజనం పెట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని థర్మల్‌ పవర్‌స్టేషన్‌లో పనిచేస్తున్న 15 మంది కూలీలు తమ ఊరికి సైకిళ్లపై బయలుదేరారు. శనివారం ఉదయం రామగుండం నుంచి బయల్దేరి మధ్యాహ్నం కాగజ్‌నగర్‌(93 కిలోమీటర్లు)కు చేరుకున్నారు. విష యం తెలుసుకున్న ఏఎస్పీ వైవీఎస్‌ సుధీంద్ర అక్కడికి చేరుకొని రుమాలు కట్టుకొని సామాజిక దూరాన్ని పాటించాలని వారికి సూచించారు.


logo