ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 01, 2020 , 01:16:12

డాలర్‌బాయ్‌ ఒక సైకో

డాలర్‌బాయ్‌ ఒక సైకో


ఖైరతాబాద్‌: బ్లాక్‌మెయిల్‌ చేసి, శారీరకంగా హింసించి, కుటుంబసభ్యులను చంపేస్తానని బెదిరించి రాజాశ్రీకర్‌ తనతో 139 మందిపై కేసు పెట్టించాడని లైంగికదాడి బాధితురాలు తెలిపింది. వారిలో చాలామంది అమాయకులని, వారిపై కేసులు వద్దన్నా వినలేదని వాపోయింది. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఎరుకల సంఘం, మహిళా, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించింది. ఉద్యోగం చేస్తున్న క్రమంలో సోమాజిగూడకు చెందిన రాజాశ్రీకర్‌ అలియాస్‌ డాలర్‌ బాయ్‌ పరిచయమయ్యాడని, అప్పటికే తనపై జరిగిన ఆకృత్యాలను తెలుసుకుని మరిన్ని అఘాయిత్యాలకు పాల్పడ్డాడని తెలిపింది. ఈ నెల 21న పోలీస్‌స్టేషన్‌లో 139 మంది పేర్లతో అతడే కంప్లయింట్‌ కాపీ తయారు చేయించాడని చెప్పింది. తనపై లైంగికదాడి, హింసకు పాల్పడిన వారిపేర్లను మాత్రమే వెల్లడిద్దామని, అమాయకులను ఇందులో లాగొద్దని చెప్తే శారీరకంగా హింసించాడని పేర్కొన్నది. ల్యాప్‌టాప్‌లో అమ్మాయిల హత్యల తాలుకు శరీరభాగాలను చూపిస్తూ సైకోలా వ్యవహరించేవాడని, తన కుటుంబసభ్యులను చంపేస్తానని బెదిరించి కేసు పెట్టించాడని వివరించింది. మీడియాముందు ఏం మాట్లాడాలో కూడా అతడే సూచించాడని చెప్పింది. అతడి నిర్భంధంలో ఉండగా.. తనకు ఎలాంటి కాల్‌వచ్చినా స్పీకర్‌ ఆన్‌చేసి మాట్లాడించేవాడని, బాత్‌రూమ్‌కు వెళ్లినా కాపలాకాసేవాడని వాపోయింది. ఇంతకుముందే అమ్మాయిలను ట్రాప్‌చేసి ఇద్దరిని పెండ్లి చేసుకున్నాడని, వారిలో ఒకరికి పాప కూడా ఉన్నదని, వారితో కూడా మాట్లాడానని తెలిపింది. మీసాల సుమన్‌ ఆకృత్యాలతో 50% నరకం చూస్తే.. రాజా శ్రీకర్‌తో 50% అనుభవించానని కన్నీరు పెట్టుకున్నది. అతడి నుంచి తప్పించుకొని స్వచ్ఛంద, కుల, మహిళాసంఘాలను ఆశ్రయించానని తెలిపింది. తాను ఫిర్యాదు చేసినవారిలో అమాయకులున్నారంటూ వారికి క్షమాపణలు చెప్పింది. యాంకర్‌ ప్రదీప్‌, సినీనటుడు కృష్ణుడుకు ఈ కేసుతో అసలు సంబంధంలేదని పేర్కొన్నది. ఏ అమ్మాయికీ ఇలాంటి అన్యాయం జరుగవద్దని కోరుకుంటున్నానని తెలిపింది. ఆన్‌లైన్‌లో తన ఫొటోలు, వీడియోలు నేటికీ వైరల్‌ అవుతున్నాయని.. దయచేసి వాటిని తొలగించాలని అభ్యర్థించింది. 

అఘాయిత్యానికి పాల్పడింది 30 శాతం మంది 

139 మంది లైంగికదాడికి పాల్పడ్డారని వచ్చిన ఫిర్యాదుపై అన్ని సంఘాలతో కలిసి బాధితురాలిని విచారించానని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఆమెకు అన్యాయంచేసిన వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలు అందరూ ఉన్నారని చెప్పారు. ఇలాంటి కేసుల్లో కులాలు, మతాలకు అతీతంగా వారిని మానవ మృగాలుగా గుర్తించాలన్నారు. ఫిర్యాదులో పేర్కొన్నవారిలో 30% మంది ఆమెపై లైంగిక దాడిచేయగా, మరో 30శాతం మంది మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టినట్టు తెలిసిందన్నారు. మిగిలినవారికి ఈ కేసుతో, అమ్మాయితో సంబంధం లేనివారుగా గుర్తించామని తెలిపారు. మైనర్‌గా ఉన్నప్పుడే బాధితురాలిపై అఘాయిత్యాలు ప్రారంభమయ్యాయని, చిన్న వయస్సువల్ల అందులోనుంచి బయటపడలేకపోయిందని చెప్పా రు. సమావేశంలో తెలంగాణ ప్రదేశ్‌ ఎరుకుల సంఘం అధ్యక్షుడు కూతాటికుమార్‌, పీవోడబ్ల్యూ జాతీయ నాయకురాలు సంధ్య, సజయ తదితరులు పాల్గొన్నారు.


logo