మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 26, 2020 , 02:29:55

వైద్యుడా వందనం

వైద్యుడా వందనం

  • కరోనాపై పోరులో అహరహం శ్రమిస్తున్న డాక్టర్లు
  • ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న సిబ్బంది..  
  • 24 గంటలూ ఐసొలేషన్‌ వార్డులోనే
  • రెడ్‌జోన్‌లో ఇంటింటికీ పరీక్షలు..  
  • విదేశాలనుంచి వచ్చినవారి వివరాల సేకరణ
  • పరీక్షల అనంతరం క్వారంటైన్‌కు తరలింపు..  
  • వైద్యుల నిబద్ధతకు ప్రజల నమస్తే

మీటరు దూరంలోనే మృత్యువు కనిపిస్తున్నది. ఏ చిన్న అవకాశం లభించినా పంజా విసరాలని ప్రయత్నిస్తున్నది. గాలిదూరే సందు దొరికితే చాలు అమాంతంగా మనిషిలోపలికి చొచ్చుకుపోవాలని కాచుకొన్నది. అణువంతైనా లేని ఓ సూక్ష్మ క్రిమి మరణమృదంగాన్ని మోగిస్తున్నది. ఆ క్రిమిని అంతమొందించడానికి తీవ్రంగా యుద్ధం మొదలైంది. రంగంలోకి దిగిన సైన్యానికి మృత్యుభయంలేదు. దగ్గరకు వెళ్తే తమను పట్టుకుంటుందని తెలుసు. పట్టుకుంటే వదిలిపెట్టదనీ తెలుసు. అలక్ష్యంచేస్తే అంతంచేస్తుందనీ తెలుసు. కానీ.. వారిలో వెరుపులేదు. వెనుకడుగు వేసేది లేదు. వారి లక్ష్యం ఒకటే.. ఆ క్రిమిని  నిర్మూలించడం. తమ జాతిని సముద్ధరించడం. ఆ క్రిమి కరోనా.. దానిపై యుద్ధం చేస్తున్న సేనలు మన వైద్య బృందాలు. తమ ప్రాణాలను పణంగా పెట్టి నిస్వార్థంగా వైద్య బృందాలు అందిస్తున్న నిరుపమాన సేవలకు తెలంగాణ సమాజం సలాం చేస్తున్నది.  దేవాలయాల్లో దేవుళ్లు భక్తులకు దర్శనాలివ్వడం మానేసి.. వైద్యుల రూపంలో రోగులకు సేవలందిస్తున్నారంటూ  సామాజిక మాధ్యమాల్లో ప్రజలు కొనియాడుతున్నారు.

హైదరాబాద్‌/ వరంగల్‌, కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధులు, నమస్తే తెలంగాణ: ప్రాణాలను హరించే కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి తెలంగాణ వ్యాప్తంగా వేల సంఖ్యలో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు. ఆశా కార్యకర్తలు, నోడల్‌ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది, టెక్నిషియన్లు, హౌస్‌ కీపింగ్‌ వర్కర్లు, అంబులెన్స్‌ సిబ్బంది 24 గంటలపాటు చేస్తున్న కృషి కి తెలంగాణ ప్రజలు జేజేలు కొడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కరోనా వ్యాధిగ్రస్థులకు సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందిని దేవుళ్లతో సమానమని కొనియాడుతున్నారు. 


బాధితులకు చికిత్స అందించడానికి హైదరాబాద్‌ గాంధీ దవాఖానలోనే వైద్యులు, నర్సులతోపాటు దాదాపు 300 మంది మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. ఫీవర్‌, ఎర్రగడ్డ ఛాతి, ఉస్మానియా దవాఖానల్లో వందమంది చొప్పున పనిచేస్తున్నారు. వరంగల్‌లోని ఎంజీఎంలో దాదాపు 120 మంది సిబ్బంది పోరాడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో దాదాపు 700 మంది పనిచేస్తున్నారు. కరీంనగర్‌లో కరోనా తీవ్రంగా ఉండటంతో 350 మందితో కూడిన వంద బృందాలు ఇంటింటికీ తిరిగి ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కరీంనగర్‌ ప్రభుత్వ దవాఖాన ఐసొలేషన్‌ వార్డులో 65 మంది సిబ్బంది సేవచేస్తున్నారు. కొవిడ్‌-19  పాజిటివ్‌ రోగులకు రోజూ రెండు నుంచి మూడుసార్లు బీపీ, టెంపరేచర్‌ చెక్‌చేస్తున్నారు. టెస్టులకు శాంపిళ్లు సేకరిస్తున్నారు. ఒక్కో పేషెంట్‌కు 10 నుంచి 20 మంది సేవలందిస్తున్నారు. 

వైరస్‌ వ్యాపించకుండా టీమ్‌లు 

వైరస్‌ బాధితులకు చికిత్సచేయడం ఒక సవాలైతే అది విస్తరించకుండా  చేయడం అత్యంత కీలకం. ఇందుకోసమే దాదాపు వెయ్యి మంది 24 గంటలు పనిచేస్తున్నారు. వైరస్‌ పాజిటివ్‌ అని తెలియగానే అతనిది ఏ ప్రాంతం, ఏ ఊరు, విదేశాలకు వెళ్లొచ్చాడా లేదా.. ఎవరెవరిని కలిశాడు.. వంటి వివరాలన్నింటినీ గంటల్లోనే సేకరిస్తున్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్నవాళ్లకు రోజూ ఫోన్లుచేసి ఆరోగ్య పరిస్థితి ని వాకబు చేస్తున్నారు. 

ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లు

ప్రతిజిల్లాకు 15మందితో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లు పనిచేస్తున్నాయి. విదేశాల నుంచి వ చ్చిన వారిని గుర్తించడం, అనుమానితులను తరలించడం, పాజిటివ్‌ వ్యక్తి తిరిగిన ప్రదేశాల్లో కలిసిన వ్యక్తులను ట్రాకింగ్‌ చేస్తున్నారు.


అన్ని రకాలుగా సిద్ధపడ్డాం

పరిస్థితులకు అనుగుణంగా సేవలు అందించడానికి సిద్ధపడ్డాం. కొవిడ్‌విభాగంతోపాటు అత్యవసరసేవలకు వైద్యులు విడుతలవారీగా పనిచేస్తున్నారు. మెరుగుపడేవరకు ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తాం.       

- డాక్టర్‌ హరీశ్‌రాజ్‌, ఆర్‌ఎంవో ఎంజీఎం, వరంగల్‌

24 గంటల వైద్యసేవలు

కరీంనగర్‌ ప్రభుత్వ దవాఖానలో  100 పడకలతో ఐసొలేషన్‌ వార్డు ఏర్పాటుచేశాం.  24 గంటలు వైద్యసేవలు అందిస్తున్నాం.

- అజయ్‌కుమార్‌, సూపరింటెండెంట్‌, ప్రభుత్వ దవాఖాన కరీంనగర్‌ 

సైనికుల్లా పనిచేస్తున్నాం

కరోనా ప్రాణాంతకమని తెలుసు. అయినా ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉన్నది.  కరోనా  మొదలైనప్పటి నుంచి నేటివరకు సైనికుల్లా సేవలందిస్తున్నాం. 

- అర్చన, వైద్యురాలు 


logo
>>>>>>