శనివారం 11 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 01:41:36

ఏడేండ్ల బాలిక కడుపులో అరకిలో వెంట్రుకలు శస్త్రచికిత్స చేసి తొలగించిన వైద్యులు

ఏడేండ్ల బాలిక కడుపులో అరకిలో వెంట్రుకలు శస్త్రచికిత్స చేసి తొలగించిన వైద్యులు

మిర్యాలగూడ టౌన్‌ : కడుపునొప్పితో బాధపడుతున్న ఏడేండ్ల బాలికకు డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్స చేసి కడుపులోనుంచి అరకిలో వెం ట్రుకలు, దారాల ముద్దను తొలగించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ  మండలం యాద్గార్‌పల్లికి చెందిన ఏడేండ్ల పాపకు చిన్నప్పటి నుంచి వెంట్రుకలు, దారాలు తినే అలవాటున్నది. కొద్దిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సిటీ స్కాన్‌లో జీర్ణాశయం ముందుభాగంలో కణితిగా భావించిన వైద్యులు హన్మంతరెడ్డి, శ్రీనిధిరెడ్డి గురువారం రాత్రి అరుదైన శస్త్రచికిత్స చేసి తొలగించారు. గడ్డను పరిశీలించగా 13 సెంటీ మీటర్ల పొడవు, అరకిలో బరువున్న వెంట్రుకల ముద్దగా గుర్తించారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ విటమిన్‌ లోపం, రక్తహీనత కారణంగా చిన్నారులు వెంట్రుకలు, దారాలు తినే అవకాశముందని, తల్లిదండ్రులు తమ చిన్నారులను నిత్యం గమనిస్తుండాలని సూచించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో బాలిక కోలుకొంటుందని పేర్కొన్నారు.


logo