శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 27, 2020 , 02:07:23

డాక్టర్‌ దంపతులకు కరోనా

డాక్టర్‌ దంపతులకు కరోనా

  • రాష్ట్రంలో కొత్తగా 4 పాజిటివ్‌లు 
  • 45కు చేరిన బాధితుల సంఖ్య

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విదేశాల నుంచి రాష్టానికి వచ్చినవారికే కాకుండా.. వారిద్వారా స్థానికంగా ఉన్నవారికి కూడా కరోనా వైరస్‌ సోకుతున్నది. రాష్ట్రంలో గురువారం మరో నలుగురికి కొవిడ్‌- 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారిని ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. ఇందులో హైదరాబాద్‌లోని దోమలగూడకు చెందిన దంపతులైన వైద్యురాలు (36), వైద్యుడు (41), ఇటీవలే ఢిల్లీ వెళ్లి వచ్చిన మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌వాసి (49), సికింద్రాబాద్‌ బుద్ధానగర్‌కు చెందిన వ్యక్తి (45) ఉన్నారు. వీరిని కలిసినవారందరికీ కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

రాష్ట్రంలో గురువారంనాటికి 45 మందికి కొవిడ్‌- 19 పాజిటివ్‌గా నమోదు కాగా, అందులో ఒకరు ఇప్పటికే పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 44 మందిని ఐసొలేషన్‌లో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నామని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారిలో ఎక్కువగా దేశ, విదేశాలకు వెళ్లి వచ్చినవారు ఉన్నారని తెలిపింది. వారితోపాటు పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారితో సన్నిహితంగా మెలిగినవారిలో కొందరికే పాజిటివ్‌ వచ్చిందని వివరించింది.


పర్యటించిన తీరు..

ఓ ప్రైవేట్‌ దవాఖాన పరిపాలనా విభాగంలో పనిచేస్తున్న దోమలగూడకు చెందిన వైద్యుడు (41) సెలవు పెట్టి ఈ నెల 14 నుంచి 16 వరకు ఇంట్లోనే ఉన్నారు. 17న ఇండిగో ఫ్లైట్‌లో తిరుపతిలోని ఎస్‌వీఐఎంఎస్‌ దవాఖానకు చెందిన ఓ వైద్యుడిని కలిసి తిరిగి సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. 18, 19 తేదీల్లో ఇంట్లోనే ఉన్నారు. 20న సోమాజిగూడ యశోద దవాఖానకు వెళ్లి, నలతగా ఉన్నదని ఇంటికి తిరిగొచ్చారు. 21న కరోనా లక్షణాలు కనిపించడంతో మందులు వాడారు. ఓ కార్పొరేట్‌ దవాఖానలో డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న తన భార్యతో కలిసి 24న గాంధీ దవాఖానకు చేరుకొన్నారు. ఆ ఇద్దరికీ పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అతడి తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలకూ పరీక్షలుచేశారు. ఆయన తల్లికి నెగెటివ్‌గా తేలగా, మిగిలినవారి నివేదికలు రావాల్సి ఉన్నది. 

మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌వాసి (49) ఈ నెల 14న సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి వెళ్లారు. తిరిగి 17న తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి 18న సికింద్రాబాద్‌కు చేరుకొన్నారు. అప్పటికే జ్వరం, జలుబుతో బాధపడుతున్న ఆయన కొడుకుతో కలిసి ఆటోలో ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత కుత్బుల్లాపూర్‌లోని ఓ వైద్యుడి వద్ద చికిత్స పొందారు. జ్వరం తగ్గకపోవడంతో ఈ నెల 25న గాంధీకి వచ్చి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.


logo