ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 17, 2020 , 03:13:26

కారును పోలిన గుర్తులు వద్దు

కారును పోలిన గుర్తులు వద్దు

  • జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జాగ్రత్తలు తీసుకోవాలి
  • ఎస్‌ఈసీ పార్థసారథికి టీఆర్‌ఎస్‌ ప్రతినిధుల విజ్ఞప్తి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: త్వరలో జరుగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కారును పోలిన గుర్తులు కేటాయించ వద్దని టీఆర్‌ఎస్‌ ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ పార్థసారథికి విజ్ఞప్తిచేశారు. దీని వల్ల తమ పార్టీకి తీరని నష్టం జరుగుతున్నదని వివరించారు. అభ్యర్థులకు కేటాయించే గుర్తుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సోమవారం ప్రణాళికాసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే సీ లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి భరత్‌ ఎస్‌ఈసీ కార్యాలయంలో కమిషనర్‌ పార్థసారథిని కలిసి పలు అంశాలపై ఫిర్యాదుచేశారు. అనంతరం వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ఎన్నికల గుర్తు అయిన కారును పోలిన ఇతర గుర్తులతో ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారని చెప్పారు. దీంతో టీఆర్‌ఎస్‌కు తీరని నష్టం జరుగుతున్నదని వివరించారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ట్రక్కు, రోడ్‌ రోలర్‌ వంటి గుర్తుల వల్ల తమ అభ్యర్థులు ఓటమి చెందారని, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుచేయడంతో ఆ గుర్తులను తొలిగించారని గుర్తుచేశారు. ఇటీవలి దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో రోటీ మేకర్‌ గుర్తు కూడా టీఆర్‌ఎస్‌కు నష్టాన్ని కలిగించిందని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కారు గుర్తును పోలినవాటిని తొలిగించాలని పార్థసారథిని కోరామని అన్నారు. సోషల్‌మీడియా కేంద్రంగా జరుగుతున్న దుష్ప్రచారంపై నిఘా ఉంచాలని, దీనిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కోరారు.