ఆదివారం 17 జనవరి 2021
Telangana - Jan 06, 2021 , 01:58:17

బైక్‌ల ఇన్సూరెన్సులు ఫేక్‌

బైక్‌ల ఇన్సూరెన్సులు ఫేక్‌

  • 11 మంది సభ్యుల ముఠా అరెస్టు
  • పొల్యూషన్‌ తనిఖీ ముసుగులో మోసం
  • ఆర్టీవో కార్యాలయాల వద్ద దందా
  • ఇన్‌స్టంట్‌ ఇన్సూరెన్సులను నమ్మొద్దు
  • మీడియాతో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌
  • ఫేక్‌ ఇన్సూరెన్సుల విక్రయాలపై సమాచారం ఈ కింది నంబర్లకు ఇవ్వండి
  • డయల్‌  100 సైబరాబాద్‌ పోలీస్‌ వాట్సాప్‌ నంబర్‌ 9490617444 

హైదరాబాద్‌ సిటీబ్యూరో, జనవరి 05 (నమస్తే తెలంగాణ): పొల్యూషన్‌ తనిఖీ ముసుగులో వాహనాల నకిలీ ఇన్సూరెన్సుల దందా నిర్వహిస్తున్న ముఠా గుట్టును సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు రట్టుచేశారు. ఎంఎస్‌ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసి నకిలీ ఇన్సూరెన్సులను తయారు చేస్తున్నట్టు దర్యాప్తులో తేల్చారు. ఇటీవల ఓ ద్విచక్రవాహనదారుడు రోడ్డు ప్రమాదంలో మరణించగా.. అతడి కుటుంబసభ్యులు ఇన్సూరెన్సు డబ్బుల కోసం రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్సును సంప్రదించారు. మృతుడి వివరాలతో అక్కడ ఎలాంటి ఇన్సూరెన్సు లేకపోవడంతో కంగుతిన్నారు. ఇన్సూరెన్సు పత్రాలను పరిశీలించగా అవి నకిలీవని తేలింది. తమ సంస్థ పేరుతో నకిలీ ఇన్సూరెన్సులు తయారు చేస్తున్నారంటూ రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్సు ఏరియా మేనేజర్‌ గురువర్ధన్‌ పెర్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు.. పొల్యూషన్‌ తనిఖీ వాహనాలను నిర్వహిస్తున్నవారే ఈ దందాకు పాల్పడుతున్నారని నిర్ధ్దారించి.. 11 మంది సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

ఎమ్మెస్‌ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని..

పొల్యూషన్‌ సర్టిఫికెట్లు ఇచ్చే వాహనాలను నిర్వహించేవారు ఎంఎస్‌ అనే సాఫ్ట్‌వేర్‌ను తమ మొబైల్స్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని ఈ మోసాలకు పాల్పడుతున్నారని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ కోసం తమవద్దకు వచ్చే వాహనదారులను ముందుగా ఇన్సూరెన్సు గురించి ఆరాతీస్తారు. ఇన్సూరెన్సు లేకపోతే అతి తక్కువ సమయంలో పేరుపొందిన కంపెనీల ఇన్సూరెన్సులను జారీచేస్తామని నమ్మబలుకుతారు. ఆర్టీవో కార్యాలయాల వద్ద దళారులతో ఒప్పందం కుదుర్చుకుని ఈ దందాకు పాల్పడుతున్నారు. వారు తమవద్ద ఉన్న సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఇన్సూరెన్సు ఫారం తీసి దానిపై పేరు కొట్టించి కంపెనీ ఇన్సూరెన్సు పాలసీగా జారీచేస్తారు. ఇలా ఒక ఇన్సూరెన్సు పాలసీని రూ.300 నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ దందాలో ప్రధాన సూత్రధారి జీ రమేశ్‌నాయక్‌తోపాటు టీ సాయిరాం, జీ గోవర్ధన్‌, జీ రమేశ్‌, జీ రాజు, ఏ ప్రవీణ్‌, జీ సుధీర్‌కుమార్‌, జీ కృష్ణ, ఎం శంకర్‌, జితేందర్‌ కుశ్వా, రవి కాడిగల్లలను అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి 1,125 నకిలీ ఇన్సూరెన్సులు, 57 వేల నగదు, 3 పొల్యూషన్‌ తనిఖీచేసే వాహనాలు, స్టాంప్‌లు, ల్యాప్‌టాప్‌, రిలయన్స్‌ లెటర్‌ ప్యాడ్స్‌, 6 సీపీయూలు, 11 మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా రిలయన్స్‌, కోటక్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గొ, ఇఫ్కో-టోకిప్‌, చోలా ఎంఎస్‌, ఫ్యూచర్‌, శ్రీరామ్‌, రాయల్‌ సుందరం జనరల్‌ ఇన్సూరెన్సులకు సంబంధించి నకిలీవి తయారు చేస్తున్నట్టు తేలింది. ఇన్‌స్టంట్‌గా ఎవరైనా వాహన ఇన్సూరెన్సులు ఇస్తామంటే నమ్మి మోసపోవద్దని, ఇన్సూరెన్సు ఏదైనా ఆయా సంస్థల నుంచి నేరుగా ఇంటికి మాత్రమే పంపిస్తారని సీపీ సజ్జనార్‌ తెలిపారు. సమావేశంలో సైబరాబాద్‌ ఎస్‌వోటీ అదనపు డీసీపీ సందీప్‌,ఏసీపీ భాస్కర్‌ శంషాబాద్‌ ఎస్‌వోటీ బృందం పాల్గొన్నారు.