హైదరాబాద్‌కు చెందిన కొంతమంది మహిళలు హ్యాష్‌టాగ్ నైటీ డ్రెస్ చాలెంజ్ అంటూ ఫేసుబుక్‌లో పెట్టారు. ఓ నవవధువుకు చాలెంజ్‌ను విసిరి పాల్గొనాలని పట్టుబట్టారు. ఆమె నైటీ ధరించిన ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్చేసింది. ఇటీవల బంధువు ఒకరు.. ఆ యువతి ఫొటో, దానికింద ‘నేను వ్యభిచారిని’ అని రాసి ఉండటాన్ని అశ్లీల వెబ్సైట్లో చూసి కుటుంబాన్ని అప్రమత్తం చేశారు. నవవధువుతోపాటు నైటీ చాలెంజ్ విసిరిన బంధువులందరి ఫొటోలు ఆ వెబ్సైట్లో ఉండటంతో ఖంగుతిన్నారు. సైబర్ నిపుణులను ఆశ్రయించగా.. చాలెంజ్‌లో పాల్గొన్నవారి ఫొటోలను సైబర్‌నేరగాళ్లు దొంగిలించి డార్క్‌నెట్‌లో విక్రయించారని ప్రాథమికంగా తేల్చారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ): హ్యాష్‌ట్యాగ్ యువర్ ఏ బ్యూటీఫుల్ మామ్.. చీరకట్టు చాలెంజ్.. నైటీ డ్రెస్ చాలెంజ్.. అంటూ వస్తున్న చాలెంజ్‌లకు స్పందిస్తున్నారా? ఓ ఫొటో దిగి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారా? ఎక్కువ లైక్స్, కామెంట్స్ కోసం ఆరాటపడుతున్నారా? మీరు ప్రమాదంలో పడుతున్నట్టే. హ్యాష్‌ట్యాగ్ చాలెంజ్ పేరిట రోజుకో కొత్త ఐడియాతో సైబర్ నేరగాళ్లు మహిళల ఫొటోలు, సమాచారం సేకరించేందుకు కుట్రలు చేస్తున్నారు. ప్రపంపవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఫొటోలు, వీడియోలు సేకరిస్తున్నారు. వాటిని మార్ఫింగ్చేసి అశ్లీలంగా మారుస్తున్నారు. ఆపై డార్క్ వెబ్సైట్లు, ఇతర పోర్న్సైట్లు, ఆన్లైన్ వ్యభిచార దందాను నిర్వహించే వెబ్సైట్లకు అమ్మి సొమ్ము చేసుకొంటున్నారు. అయ్యో చుట్టాలు పంపించారు స్పందించకుంటే బాగోదనో, మొహమాటపడో కొంతమంది మహిళలు పలు చాలెంజ్‌లలో పాల్గొంటున్నారు. అందంగా ముస్తాబై వివిధ రంగుల చీరలను కట్టుకుని ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ చాలెంజ్ నుంచి సైబర్ నేరగాళ్లు ఫొటోలను తీసుకొని డార్క్‌నెట్‌లో అమ్మేస్తున్నారని సైబర్ నిపుణులు గుర్తించారు. హ్యాష్‌ట్యాగ్ చాలెంజ్‌లో పెట్టిన ఫొటోలు చాలావరకు దుర్వినియోగమవుతున్నాయి.
వ్యక్తిత చాలెంజ్‌ల పేరుతో మీ ఫొటోలను ఫేసుబుక్‌లో పెట్టడం వల్ల సైబర్ నేరగాళ్లు సులభంగా చోరీ చేస్తున్నారు. వాటిని డార్క్‌నెట్‌లో డబ్బుకు అమ్మేస్తారు. లైక్‌లకు ఆశపడి లేదా తెలిసినవారు ఇచ్చిన చాలెంజ్‌ను స్వీకరించడంతో మీ ఫొటోలు ఇంటర్నెట్లోకి వెళ్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరం. ఇవి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మారుతాయి. ఫొటోలను పెట్టడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. దీనివల్ల ఏ ఒక్కరికి సాయం జరుగదని గుర్తించాలి.
–సందీప్ ముదల్కర్, సైబర్ నిపుణుడు