ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 02:36:22

కవాసాకి భయం వద్దు

కవాసాకి భయం వద్దు

  • అందుబాటులో మందులు 
  • రాష్ట్రంలో అలాంటి కేసుల్లేవ్‌ 
  • నిలోఫర్‌ వైద్య నిపుణుడు నరహరి

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కవాసాకి వ్యాధి గురించి భయాందోళన అవసరంలేదని నిలోఫర్‌ దవాఖాన వైద్యులు స్పష్టంచేస్తున్నారు. ఇది రక్తనాళాలపై ప్రభావం చూపుతున్నదని తెలిపారు. ప్రస్తుతం కరోనా వచ్చి పోయినవారిలో ఇది కనిపిస్తున్నట్టు పలు మెడికల్‌ జర్నల్స్‌లో ప్రచురితమైందని చెప్పారు. అమెరికా, చైనాలో ఇది రుజువైందని, ఢిల్లీలోనూ ఆరు కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణలో మాత్రం కరోనా వచ్చిన చిన్నారులకు కవాసాకి వచ్చిన దాఖలాలు లేవని తేల్చిచెప్పారు. ఈ వ్యాధి సాధారణంగా 10 ఏండ్లలోపు పిల్లల్లో వస్తుందని చెప్తున్నారు. కవాసాకి అనేది కొత్త వ్యాధి కాదని, పాతదేనని.. దీనికి స్టెరాయిడ్స్‌తో చికిత్స అందిస్తారని తెలిపారు. 5 రోజుల కంటే ఎక్కువగా జ్వరం ఉండటం, నాలుక స్ట్రాబెర్రీ రంగుకు మారడం, కండ్లు ఎర్రబడటం, మెడ కింద ఒక వైపు గ్రంధి వాపు రావడం, చర్మం పొట్టుగా రాలిపోవడం వంటివి ఈ వ్యాధి లక్షణాలని వివరించారు.

రాష్ట్రంలో కవాసాకి లేదు

ఏదైనా వైరస్‌ సోకి, తగ్గిన తరువాత కవాసాకి వ్యాధి రావడం సాధారణమే. తెలంగాణలో కవాసాకి వచ్చిన దాఖలాలు కనిపించలేదు. మూడు నెలల్లో నిలోఫర్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. కానీ, వారికి కరోనా పరీక్షలు జరిపితే నెగెటివ్‌ వచ్చింది. అంటే అవి సాధాణంగా వచ్చిన కేసులుగా పరిగణిస్తున్నాం. కొవిడ్‌ తదనంతరం వచ్చిన కేసులు కావు. కవాసాకి వచ్చినా భయం అవసరంలేదు. ఆ సిండ్రోమ్‌కు మన వద్ద మందులు అందుబాటులో ఉన్నాయి.

-డాక్టర్‌ నరహరి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, నిలోఫర్‌ దవాఖాన


logo