శనివారం 16 జనవరి 2021
Telangana - Nov 30, 2020 , 01:47:39

బీజేపీ కుట్రకు బలికావొద్దు

బీజేపీ కుట్రకు బలికావొద్దు

  • హైదరాబాద్‌లో ఆశాంతి కోసం కుయుక్తులు
  • పెట్టుబడులు తరలించుకుపోయే పన్నాగం
  • ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు 

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: గ్రేటర్‌ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో బీజేపీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతలు దెబ్బతీసి ఇక్కడికి వచ్చే పెట్టుబడులు గుజరాత్‌, ముంబైకి తరలించుకుపోవాలని బీజేపీ నేతలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆదివారం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని భారతీనగర్‌, రామచంద్రాపురం, పటాన్‌చెరు డివిజన్లలో ఎన్నికల ప్రచార సభల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. సీట్లు గెలువాలనే దుగ్ధతో బీజేపీ నాయకులు ఓటర్ల కాళ్లు మొక్కుతున్నారని, రేపు కాళ్లు లాగుతారని.. ఈ విషయంలో ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. డబ్బులిస్తాం.. ఓట్లు వేయడానికి రావొద్దని ముస్లింలకు బీజేపీ నేతలు చెబుతున్నారని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింలు బీజేపీ ప్రలోభాల బారిన పడొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి ముస్లిం టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో నెలకు రూ.400 పెన్షన్‌ ఇస్తుంటే తెలంగాణలో మాత్రం రూ.2 వేలు అందిస్తున్నట్లు వెల్లడించారు. బీహార్‌లో బీజేపీ మూడుసార్లు అధికారంలో వచ్చినా కనీస అభివృద్ధి చేయలేకపోయిందని మంత్రి విమర్శించారు. కార్మికులు 12 గంటలు పనిచేయాలని ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లోని అక్కడి బీజేపీ ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇచ్చాయని, ఇక్కడ మాత్రం 8 గంటలే పని సమయం ఉన్నదన్నారు. 

సీఎం కేసీఆర్‌ మరో ఉద్యమం..

నరేంద్ర మోదీ సర్కార్‌ కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్ముతోందని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవడానికి సీఎం కేసీఆర్‌ మరో ఉద్యమం చేయబోతున్నారని తెలిపారు. బీహెచ్‌ఈఎల్‌, ఓడీఎఫ్‌, బీడీఎల్‌ వంటి సంస్థల వల్ల పటాన్‌చెరు అభివృద్ధి చెందిందన్నారు. సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ నగరాన్ని పునర్నిర్మిస్తుంటే ప్రతిపక్ష పార్టీల నాయకులు పీవీ ఘాట్‌, ఎన్టీఆర్‌ ఘాట్లను కూల్చుతామంటూ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి వరద సాయాన్ని నిలిపివేయించాయన్నారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే డిసెంబర్‌ 7 నుంచి తిరిగి వరద బాధితులకు రూ.10 వేల చొప్పున సాయం పంపిణీ చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌ నగర ప్రజలకు సీఎం కేసీఆర్‌ మంచినీటిని ఉచితంగా సరఫరా చేయాలని నిర్ణయించారని, ఇకపై ఎవరూ నల్లా బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. భారతీనగర్‌లో సింధూఆదర్శ్‌రెడ్డి, రామచంద్రాపురంలో పుష్పానగేష్‌ యాదవ్‌, పటాన్‌చెరులో మెట్టు కుమార్‌ యాదవ్‌లను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి మరోసారి పిలుపునిచ్చారు. ఆయా సభల్లో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, క్రాంతి కిరణ్‌, ఎమ్మెల్సీ వీ భూపాల్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటే రు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

సీట్లు గెలువాలనే దుగ్ధతో బీజేపీ నాయకులు ఓటర్ల కాళ్లు మొక్కుతున్నారు. రేపు కాళ్లు లాగుతారు. ఈ విషయంలో ఓటర్లు జాగ్రత్తగా ఉండాలి.

- మంత్రి హరీశ్‌రావు