బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 01:51:18

ఆక్సిజన్‌ కొనే పరిస్థితి రావొద్దు

ఆక్సిజన్‌ కొనే పరిస్థితి రావొద్దు

  • ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు 

హైదరాబాద్‌/ సిద్దిపేట, నమస్తే తెలంగాణ: పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ప్రకృతికి సేవ చేస్తే మనుషులకు చేసినట్టేనని తెలిపారు. అడవుల్లో పచ్చదనం పెంచేందుకు డ్రోన్‌ కెమెరాల ద్వారా విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని శనివారం పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్యతో కలిసి సిద్దిపేట ఆక్సిజన్‌ అర్బన్‌ పార్కులో మంత్రి ప్రారంభించారు. అంతకుముందు సిద్దిపేటలో కషాయ వితరణ కేంద్రాన్ని ప్రారంభించారు. సిద్దిపేట అర్బన్‌, నంగునూరు మండలాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఇప్పటికే ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఆక్సిజన్‌ కొనుక్కునే పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక్క రోజు మనిషి పీల్చే గాలి మూడు ఆక్సిజన్‌ సిలిండర్లతో సమానమన్నారు. ఒక్కో సిలిండర్‌ ఖర్చు ఏడు వందల రూపాయలు కాగా, ఈ లెక్కన మూడు సిలిండర్లకు రూ.2,100 అవుతుందన్నారు. మనిషి జీవిత కాలంలో పీల్చే ఆక్సిజన్‌ కొనుగోలు చేస్తే దాదాపు రూ.5 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పారు. చెట్లు ఉచితంగా ఆక్సిజన్‌ను ఇస్తున్నాయని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. కల్యాణలక్ష్మి చెక్కులు తీసుకున్న అక్కా చెల్లెళ్లు.. అందుకు బదులుగా తనకు ఒక బహుమతి ఇవ్వాలని మంత్రి సూచించారు. తడిపొడి చెత్తను వేర్వేరు చేసి ఇవ్వాలని, ప్రతి ఒక్కరు విధిగా మొక్కలను నాటాలని కోరారు. వనజీవి రామయ్య మాట్లాడుతూ.. చెట్టు కన్న తల్లి లాంటిదన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. 

కరోనా వచ్చిందని అధైర్య పడొద్దు..

కరోనా వచ్చిందని అధైర్య పడొద్దని మంత్రి హరీశ్‌రావు సూచించారు. నంగునూరు మండలం రాంపూర్‌కు చెందిన కరోనా బాధితుడితో మంత్రి ఫోన్‌లో మాట్లాడి ధైర్యంచెప్పారు. స్వయంగా ఐసొలేషన్‌ కిట్‌ను ఆయన ఇంటికి పంపించారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు. 


logo