పిచ్చోళ్ల చేతిలో రాయి కావద్దు

- అంతా ఆలోచించి నిర్ణయం తీసుకోండి .. టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం
- ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నడుపుతున్న బీజేపీ.. మోదీ నయా స్కీమ్.. బేచో ఇండియా
- జీహెచ్ఎంసీ ఎన్నికలపై టీవీ చానల్ లైవ్ కార్యక్రమంలో మంత్రి కే తారకరామారావు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇద్దరు పిచ్చోళ్ల మధ్య హైదరాబాద్‌ను పిచ్చోడి చేతిలో రాయిని చేయవద్దని రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు కోరారు. నోటికొచ్చినట్టు మాట్లాడే నాయకులను ఏం చేయాలన్నది ప్రజలే ఆలోచించాలని అన్నారు. ‘రాజ్యాంగాన్ని ఎదిరించి మాట్లాడితే టీవీల్లో వస్తామని మాట్లాడితే సరికాదు. అలా మాట్లాడాలంటే మేము మాట్లాడుతాం.. తెలంగాణకు కేసీఆర్ ప్రధానమంత్రి అని అంటాం..అయిపోతరా? అందుకే ఈ పిచ్చోళ్ల చేతిలో నగరాన్ని పెట్టొద్దు అంటున్నా.. అందరికంటే తెలివైన వాళ్లు హైదరాబాద్ ఓటర్లు.. నాలుగోతేదీన దూద్‌కా దూద్.. పానీకా పానీ అయితది’ అన్నారు. శుక్రవారం ఒక వార్తా చానల్ లైవ్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. వివిధ అంశాలపై కేటీఆర్ స్పందన ఆయన మాటల్లోనే..
అంతా ఆలోచించి నిర్ణయం తీసుకోండి
ఢిల్లీలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. అక్కడ లా అండ్ ఆర్డర్ కేంద్రం చేతుల్లోనే ఉంటుంది. కానీ ఢిల్లీలో అల్లర్లు మతకల్లోలాలు జరిగాయి. వారం రోజులపాటు బయటికి వెళ్లలేని పరిస్థితి ఉంది. ఢిల్లీలో ట్రంప్ ఉంటే, అదే ప్రాంతంలోనే కదా సీఐఏ, ఎన్ఆర్సీపైన ఆందోళనలు జరిగాయి. ఇలాంటి పరిస్థితులు హైదరాబాద్‌కు అవసరమా? ఇలా అయితే హైదరాబాద్‌కు కంపెనీలు ఆపిల్, అమెజాన్, గూగుల్ వంటి ప్రపంచస్థాయి సంస్థలు వస్తాయా? నేను చెప్పేది తప్పైతే కూర్చొని అంతా ఆలోచన చేయండి
ప్రతిపక్షం ఉండొద్దని ప్రజలు అనుకున్నారు
దుబ్బాక ఫలితంతో టీఆర్ఎస్పై ఎలాంటి ఒత్తిడి లేదు. ‘ఓటమిలో గుణపాఠాలు ఉంటాయి. గెలుపులో పాఠాలు ఉంటాయి’ అని సీఎం కేసీఆర్ తరుచూ చెప్తుంటారు. అదే స్ఫూర్తితో దుబ్బాక ఎన్నికలను లోతుగా విశ్లేషిస్తున్నాం. టీఆర్ఎస్ ఇప్పటిరకు అనేక ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో గెలుపొందింది. టీఆర్ఎస్ విజయాలు అలవాటయ్యాయి కాబట్టి మీడియాకు, సోషల్ మీడియాకు ఇన్నాళ్లూ అవి పెద్ద వార్తలుగా కనిపించలేదు. దుబ్బాకలో 500 ఓట్లతో ఓడిపోయినంత మాత్రాన పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గత ఆరేండ్లలో కేవలం రెండు సందర్భాల్లోనే మాకు ఆశించిన ఫలితాలు రాలేదు. లోక్‌సభలో 16 సీట్లు గెలుస్తామనకుంటే 9 వచ్చాయి. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదని ప్రజలే అనుకుంటున్నారు. కాబట్టే 32 జెడ్పీలు, మున్సిపాలిటీలన్నింటిలోనూ టీఆర్ఎస్కే పట్టం కట్టారు.
టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం
దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించేలా చట్టాలు తీసుకొచ్చాం. చట్టం ప్రకారం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 75 కేటాయించాల్సి ఉన్నా.. మరో 10 పెంచి 85 టికెట్లు మహిళలకు ఇచ్చాం. ఎస్టీలకు 3, ఎస్సీలకు 13 టికెట్లు కేటాయించాం. మొత్తంగా 72 శాతం టికెట్లు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించి సంపూర్ణ సామాజిక న్యాయం పాటించాం. ప్రతిపక్ష పార్టీల్లో టికెట్ల కేటాయింపు సందర్భంగా గొడవలు, ఆఫీస్‌ల మీద పడి ధ్వంసం చేయడం చూస్తున్నాం. టీఆర్ఎస్లో అలాంటి పరిస్థితి లేదు. 150 మంది అభ్యర్థులకు ప్రశాంతంగా బీ ఫారాలు ఇచ్చాం.
ఇందిరాపార్క్ వద్దే ధర్నా ఎందుకు?
ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్‌ను ఎత్తివేయమని ప్రజలే స్వయంగా కోరారు. పార్క్ చుట్టూ వందల కుటుంబాలు ఉన్నాయి. పొద్దున లేచినప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నామని వాళ్లు ఫిర్యాదు చేశారు. సాధారణంగా ఒక సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ధర్నాలు చేస్తారు. గతంతో పోల్చితే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా విస్తృతి పెరిగింది. ఎక్కడ నిరసన తెలిపినా ప్రజల దృష్టిని సులభంగా ఆకర్షించవచ్చు. ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఇందిరాపార్క్ వద్దే ధర్నా ఎందుకు చేయాలనేది నా ప్రశ్న. కావాలంటే నగర శివారులో ధర్నా చేసుకోవచ్చని చెప్పాం.
అభ్యర్థుల వల్ల సమస్య ఉంటే సరిచేస్తాం
ఎన్నికల ఫలితాలు ప్రజల మూడ్‌ను ప్రతిబింబిస్తాయి. దీనిని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. ఇందులో అనేక కోణాలు ఉంటాయి. టీఆర్ఎస్కు సంబంధించి కొందరు అభ్యర్థుల పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉండొచ్చు. ఆయా ప్రాంతాల ప్రజలకు నా విన్నపం. వారికి అవకాశం ఇచ్చి గెలిపించండి. ఆ సమస్యలను అధిగమిస్తాం. పురపాలక శాఖ మంత్రిగా నాకు ఇంకా మూడేండ్ల సమయం ఉన్నది. ఆలోగా అన్ని ఇబ్బందులను అధిగమించి ప్రజా సమస్యలను క్రమంగా పరిష్కరిస్తాం.
టీఆర్ఎస్ వెంటే యువత
టీఆర్ఎస్కు యువత అప్పుడు, ఇప్పుడు అండగా ఉన్నారు. ఎప్పటికీ ఉంటారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నేను ఇప్పటివరకు 30-35 బహిరంగ సభలు నిర్వహించాను. ఇందులో సగానికిపైగా కనిపించేది యువతే. టీఆర్ఎస్ అంటే అభిమానం లేకుంటే వాళ్లు ఎందుకు వస్తారు. పరిశ్రమలను తీసుకొస్తూ ఉద్యోగాలు ఇస్తున్నదని ఎవరు? లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగే ఐటీఆర్ఆర్ను రద్దు చేసింది ఎవరో యువతకు తెలియదా?.
మోదీ నయా స్కీమ్.. బేచో ఇండియా
ప్రధాని మోదీ.. స్కిల్ ఇండియా.. ఖేలోఇండియా.. ఫిట్ ఇండియా.. ఇలా అనేక కొత్త స్కీమ్‌లు ప్రకటించారు. అవి ఎంత ఫలితం ఇచ్చాయో అందరికీ తెలుసు. ఇప్పుడు మోదీ అన్నింటినీ అమ్మేద్దామంటూ కొత్త స్కీమ్ ప్రకటించారు. అదే ‘బేచో ఇండియా’. ఎయిర్ ఇండియాను నష్టాల పేరుతో అమ్మేస్తున్నారు. మరి లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్మేస్తున్నారు? కాబట్టి మేం పిలుపునిస్తున్నాం.. ‘సోచో ఇండియా’. ఒక్కసారి ఆలోచించండి అభివృద్ధి కావాలా? అరాచకం కావాలా?. విద్వేషం కావాలా జనహితం కావాలా?. ప్రజలు కూడా క్లియర్‌గా ఉన్నారు. మా రోడ్డు బాగుండాలి.. కరెంటు ఉండాలి.. నాలాలు బాగుపడాలి వంటివే ఆలోచిస్తున్నారు తప్ప మతం, కులం గురించి ఆలోచించడం లేదు.
అభివృద్ధే మా ఎజెండా..
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత 100 రోజుల ప్రణాళిక ప్రకటించాం. వంద రోజుల్లో ఏయే పనులు చేస్తామో చెప్పాం. అవన్నీ చేశాం. అంతేగానీ.. వందరోజుల్లోనే విశ్వనగరం చేసేస్తామని ఎక్కడా చెప్పలేదు. విశ్వనగరాలు రాత్రికిరాత్రే తయారుకావు. గతంతో పోల్చితే కచ్చితంగా హైదరాబాద్ నగరం బాగుపడుతున్నది. నగరం బాగా విస్తరిస్తున్నది. ఈసారి కూడా అభివృద్ధే మా ఎజెండా. నగరంలో మంచినీళ్ల సమస్యను 90 శాతం పరిష్కరించాం. ఈసారి దాన్ని 100 శాతం చేస్తాం. కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తిచేసి నగర ప్రజలకు రోజూ తాగునీరు అందిస్తాం. పేదలు నీళ్లకు బిల్లు కట్టక్కర్లేదని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. మూడేండ్లలో నాలాలను అభివృద్ధి చేస్తాం. డ్రైనేజీ వ్యవస్థ పూర్తయితేనే గుంతలు లేని రోడ్లు సాకారం అవుతుంది. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నడుపుతున్న బీజేపీ సోషల్ మీడియాను అనుకూలంగా, వ్యతిరేకంగా వాడుకునే అవకాశం ఉన్నది. సోషల్ మీడియాలో ఎవరినైనా ట్యాగ్ చేయొచ్చు. పాలకులను ట్యాగ్ చేసి సమస్యను ప్రస్తావిస్తే ఓకే. అలాకాకుండా బండబూతులు తిడుతాం. విద్వేష వ్యాఖ్యలు చేస్తాం అంటే కుదురదు. అలాంటివారిని చట్టం వదిలిపెట్టదు. సోషల్ మీడియాను ఉపయోగించి నేను స్వయంగా వందల సమస్యలను పరిష్కరించాను. నా దృష్టికి వచ్చిన సమస్యలను నా బృందానికి ఇచ్చి పరిష్కారం అయ్యేలా చూస్తున్నాను. లాక్డౌన్లో ఒక మహిళ తన కూతురుకు పాలు లేవని అడిగితే డిప్యూటీ మేయర్ స్వయంగా వెళ్లి సాయం చేశారు. ‘విషయం చెప్పండి.. విమర్శించండి.. నిర్మాణాత్మక ఆలోచనలు చెప్పండి’.. అంతేగానీ తిట్టడమే పనిగా, పైశాచికంగా ఉంటే ఎలా?. దేశంలో బీజేపీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నడుపుతున్నది. వాళ్ల వాట్సప్ యూనివర్సిటీ పెద్దాయన వైస్ చాన్స్‌లర్. ‘అబద్ధమైనా సరే ప్రజలకు పదేపదే చెప్పండి.. నమ్మించండి.. లేదా కన్ఫ్యూజన్లో పడేయండి’ అని అమిత్ షా స్వయంగా చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయి. దుబ్బాకలో అదే జరిగింది. పింఛన్లలో మొత్తం మేమే ఇస్తున్నాం అని ప్రచారం చేశారు. చర్చకు రమ్మంటే మాత్రం రారు.
నేమ్ చేంజర్స్ కావాలా? గేమ్ చేంజర్స్ కావాలా?
వాళ్లు గెలిస్తే హైదరాబాద్ పేరు మారుస్తామని అంటున్నారు. ఎందుకు పేరులో హైదర్ ఉన్నదనా? ఒక కమ్యూనిటీ అంటే అంత అలర్జీ ఎందుకు? దేశంలో 30 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. అందరూ తీవ్రవాదులేనా?. అహ్మదాబాద్‌లో అహ్మద్ ఉన్నాడని పేరు మారుస్తామని చెప్పారు. మరి ఎందుకు మార్చలేదు?. అయినా పేరు మార్చితే ఏమొస్తుంది? మద్రాస్ చెన్నైగా మారిన తర్వాత కొత్తగా ఏమొచ్చింది? కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి. సౌభాగ్యనగరం కావాలా?.. దౌర్భాగ్యనగరం కావాలా?. నేమ్ చేంజర్స్ కావాలా? గేమ్ చేంజర్స్ కావాలా?. కరోనా దెబ్బతో వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నరు. ఇలాంటి సమయంలో మరో దెబ్బ పడితే ఎప్పటికీ కోలుకోలేం. కరోనా దెబ్బ నుంచి కోలుకొని ముందుకు పోవాలంటే నగరం ప్రశాంతంగా ఉండాలి.
తాజావార్తలు
- వేధింపులపై నటి నేహా శర్మ ఫిర్యాదు
- దక్షిణాదిలో సత్వరమే సుప్రీం బెంచ్ ఏర్పాటు చేయాలి
- కూల్‌డ్రింక్ అని తాగితే.. ప్రాణాలమీదకొచ్చింది
- ఉద్యోగ సంఘాలతో చర్చలకు సీఎం ఆదేశం
- టెస్లా కాన్ఫిడెన్షియల్ డేటా చోరీకి టెక్కీ యత్నం!
- డార్క్ మోడ్ నిజంగా కళ్లని కాపాడుతుందా.. ?
- క్రెడిట్ అంతా సిరాజ్కే దక్కుతుంది: అజింక్య
- మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీని సందర్శించిన మంత్రులు
- రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ డేవిడ్ మృతి
- మందిరాబేడీ 'సన్ డే జబర్దస్త్' వర్కవుట్స్..వీడియో