గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 21, 2020 , 01:35:16

దీక్షిత్‌రెడ్డి తల్లికి మళ్లీ బెదిరింపు కాల్‌

దీక్షిత్‌రెడ్డి తల్లికి మళ్లీ బెదిరింపు కాల్‌

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌లో కిడ్నాపైన తొమ్మిదేండ్ల బాలుడు దీక్షిత్‌రెడ్డి ఆచూకీ ఇంకా లభించకపోగా అతడి తల్లికి మళ్లీ బెదిరింపు కాల్‌ వచ్చినట్లు తెలిసింది. దీక్షిత్‌రెడ్డి పట్టణంలో ఆదివారం కిడ్నాప్‌ కాగా, అతడి బంధువులు సహా నలుగురిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిడ్నాప్‌ వ్యవహారంలో బాలుడి బాబాయ్‌ మనోజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి ఫోన్‌ కాల్స్‌ నిలిచిపోగా మంగళవారం మళ్లీ ప్రారంభమయ్యాయి. దీక్షిత్‌ తల్లి వసంతకు ఫోన్‌ చేసిన కిడ్నాపర్‌, రూ.45 లక్షలు సిద్ధం చేసుకోవాలని హెచ్చరించడంతోపాటు ఎక్కడ ఇవ్వా లో బుధవారం ఫోన్‌ చేస్తానని చెప్పినట్లు తెలిసింది. అంత డబ్బు లేదని, కొంత మొత్తం ఇస్తామని చెప్పగా మాట వినిపించుకోకుండానే కిడ్నాపర్‌ ఫోన్‌ కట్‌ చేయగా అప్రమత్తమైన పోలీసులు.. లోకేషన్‌ను ట్రాప్‌ చేసి బీహా ర్‌ నుంచి కాల్స్‌ వస్తున్నట్లు గుర్తించారు. సీసీ కెమెరాలు పరిశీలించినా కిడ్నాపర్ల జాడ దొరకలేదు. ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి రంగంలోకి దిగి మంగళవారం 15 మంది అనుమానితులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారించారు. ఇందులో బీటెక్‌ విద్యార్థులతోపాటు దీక్షిత్‌రెడ్డి తల్లిదండ్రులు చెప్పిన వారు కూడా ఉన్నారు. 48గంటలు గడిచినా బాలుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.