మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 03:08:16

దీపావళి నోములు ఆదివారమే!

దీపావళి నోములు ఆదివారమే!

రంగు మతాబుల శోభావళి దీపావళి. ఏటా అమావాస్య నాడు వచ్చే ఈ పండుగ ఈసారి రెండు రోజుల సంబురానికి సిద్ధమవ్వమంటున్నది. అమావాస్య తిథి శని, ఆదివారాల్లో పరివ్యాప్తమై ఉన్నందున రెండురోజుల పర్వంగా మారింది. దీంతో హారతులు, లక్ష్మీపూజలు శనివారం, నోములు ఆదివారంచేసుకోవాలని పంచాంగకర్తలు శాస్త్రప్రకారం నిర్ణయించారు. - జిందగీ డెస్క్‌

ఆశ్వీయుజ బహుళ చతుర్దశి, అమావాస్య తిథులు శనివారం కలిసి వచ్చాయి. శనివారం చతుర్దశి తిథి పగలు 1.35 గంటల వరకు ఉన్నది. తర్వాత అమావాస్య తిథి ప్రవేశిస్తున్నది. రాత్రంతా అమావాస్య తిథి పరివ్యాప్తమై ఉండటంతో దీపావళి శనివారమే చేసుకోవాలి. అమావాస్య తిథి ఆదివారం ఉదయం 11.15 గంటల వరకు ఉన్నది. ఫలితంగా దీపావళి సందర్భంగా నిర్వహించే వ్రతాలు ఆదివారం చేసుకోవాలి.

హారతులు ఎప్పుడు?

మన తెలంగాణలో దీపావళి నాడు హారతులు ప్రధానమైన వేడుక. పుట్టింటికి వచ్చిన ఆడకూతుళ్లు ఇంట్లో ఉన్న మగవాళ్లందరికీ హారతులు ఇస్తారు. సంప్రదాయబద్ధంగా కొనసాగే ఈ ప్రక్రియ శనివారం సూర్యోదయానికి ముందుచేసుకోవాలని సిద్ధాంతులు సెలవిస్తున్నారు. సూర్యోదయానికి ముందు కుదరని పక్షంలో, దుర్ముహూర్తం వెళ్లిపోయిన తర్వాత ఇవ్వొచ్చు. దుర్ముహూర్తం సూర్యోదయం నుంచి 1.36 గంటల నిడివి ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో సూర్యోదయం అయ్యాక 1.36 గంటల తర్వాత హారతులు ఇవ్వొచ్చు.

అదే రోజు లక్ష్మీపూజలు

దీపావళి పండుగ విశేషాలలో ముఖ్యమైం ది లక్ష్మీపూజలు. వ్యాపారస్తులంతా దీపావళి సాయంత్రం లక్ష్మీదేవికి పూజలు చేసి, కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీపూజలతోనే కొత్త ఆర్థిక సంవత్సరాన్ని మొదలుపెడతారు. రాత్రిపూట అమావాస్య తిథి ఉన్నప్పుడే లక్ష్మీ పూజలు చేసుకోవాలని పండితులు చెప్తున్నారు. శనివారం సాయంత్రం లక్ష్మీపూజలు చేసుకోవాలని సూచిస్తున్నారు.

నోముల ముచ్చట

నోముల విషయంలోనూ పండితులు పలు సూచనలు చేస్తున్నారు. లక్ష్మీపూజలకు ఎలాగైతే సాయంత్రం అమావాస్య ఉండాలన్న నియమం ఉన్నదో.. నోములు నిర్వహించాలంటే సూర్యోదయానికి అమావాస్య తిథి ఉండాలని చెప్తున్నారు. శనివారం సూర్యోదయానికి అమావాస్య తిథి లేకపోవడంతో.. శనివారం కేదారేశ్వర నోములు చేసుకోకూడదు. సూర్యోదయానికి అమావాస్య తిథి ఆదివారంనాడు ఉండటంతో అదే రోజు నోములు చేసుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు.

కొత్త అల్లుళ్లు రెండేండ్లు ఆగాల్సిందే!

దీపావళికి కొత్త అల్లుడిని ఇంటికి పిలిచి కొత్తబట్టలు, కానుకలు సమర్పించే సంప్రదాయం తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో ఉన్నది. ఈసారి విశాఖలు ఉండటంతో కొత్త అల్లుళ్లు అత్తారింటికి వెళ్లకూడని పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది పెండ్లయిన వాళ్లందరికీ ఇది వర్తిస్తుంది. మొదటి ఏడాది దీపావళికి వెళ్లలేని పక్షంలో రెండో ఏడాది కూడా వెళ్లకూడదన్న ఆచారమున్నది. వేరే పండుగలకు, పబ్బాలకూ, ఇతర సందర్భాల్లోనూ అత్తగారింటికి వెళ్లడంలో ఎలాంటి ఇబ్బందీలేదు. కానీ, దీపావళికి వెళ్లాలంటే మాత్రం కొత్త అల్లుళ్లు మరో రెండేండ్లు ఆగాల్సిందే!

దుర్గతులు తొలగిపోవడానికి..

నరక అనే పదానికి దుర్గతి అనే అర్థమున్నది. ‘నరక చతుర్దశి’ అంటే నరకం నుంచి తరింపజేసేది అని అర్థం. ఆశ్వీయుజ కృష్ణ త్రయోదశి, చతుర్దశి సంధికాలంలో చంద్రోదయ గడియల్లో నరకుడిని శ్రీకృష్ణుడు సంహరించాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చతుర్దశి నాడు చంద్రోదయ కాలం (తెల్లవారు జామున)లో తైలాభ్యంజన స్నానం చేసే సంప్రదాయం అనాదిగా వస్తున్నది. అంతేకాదు, నువ్వుల నూనెలో లక్ష్మీ కళలు ఆవహించి ఉంటాయి. చతుర్దశి తెల్లవారు జామున నువ్వులతో తలంటుకొని తలస్నానం చేస్తే లక్ష్మీప్రదం. నరక దుర్గతి నుంచి విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ప్రదోషకాలంలో దీపారాధన చేయాలి. ఈ దీపాలు లక్ష్మీకటాక్షం కలిగించడంతోపాటు పితృదేవతలకు నరకబాధను విముక్తిచేస్తాయని నమ్మకం.

- టీఎన్‌సి సంపత్‌కుమార కృష్ణమాచార్య, యాదాద్రి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి

కొత్త నోములు వద్దు!

ఈ ఏడాది కొత్తగా కేదారేశ్వర వ్రతాలు చేసుకోకూడదు. విశాఖలు ఉన్నందున పడిపోయిన వ్రతాలు తిరిగి మొదలు పెట్టడం గానీ, కొత్తగా వ్రతాలు ప్రారంభించడం గానీ చేయకూడదు. విశాఖ కార్తెలో దీపావళి రావడంతో కొత్త నోములకు ఆస్కారం లేకుండా పోయింది. ఇప్పటికే వ్రతాలు నిర్వహించేవారికి విశాఖలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

- దివ్యజ్ఞాన సిద్ధాంతి, మేడిపల్లి