శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 19:44:10

ఐదురోజుల పండుగ దీపావళి !

ఐదురోజుల పండుగ దీపావళి !

హైద‌రాబాద్ : దీపావళి అనేది చాలాచోట్ల ఇప్పటికి ఐదురోజుల పండుగ.  ఆ ఐదురోజుల విశేషాలు తెలుసుకుందాం. మొద‌టిరోజు త్రయోదశిరోజు, తర్వాత నరకచతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, భగినిహస్త భోజనం ఇలా ఐదురోజులు. ఒక్కోదాని విశేషం…


ధన్వంతరీ త్రయోదశి :

ధన్‌తెరాస్‌గా పేరుగాంచిన రోజు. ధన త్రయోదశి అంటారు. ఈరోజు శ్రీలక్ష్మీ ఆరాధన ప్రారంభిస్తారు. కానీ ఈరోజు ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి మూల పురుషుడు శ్రీమన్నారాయణ స్వరూపుడు అయిన "ధన్వంతరీ" జయంతి. పాల సముద్రం చిలికిన సమయంలో చేతిలో అమృత భాండముతో అవతరించాడు. ధన్వంతరి జయంతి. ఆ స్వామి ఆరాధన వల్ల ఆరోగ్యం లభిస్తుంది. ఆరోగ్యలక్ష్మిని మించిన ధనం ఏముంటుంది. ఆరోగ్యం లేకుంటే ఏది ఉన్నా లేనెట్లేకదా. 

నరకచతుర్దశి :

నరకాసుర సంహారం జరిగిన రోజు. ఈ రోజు ప్రాక్జ్యోతీషపురం (నేటి అస్సాం)ను పాలించే 'నరకుడు' నరరూప రాక్షసుడు దేవీ ఉపాసకుడు కానీ దేవిని వామాచారంలో క్షుద్రపూజలు చేసి అనేక అద్భుతశక్తులను సంపాదించి దేవతలను కూడా ఓడించాడు. వరాహమూర్తికి - భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకుడు తామస ప్రవృత్తితో జన్మించాడు. నరకాసురిని బాధల నుంచి ప్రజలకు విముక్తి కలిగించడానికి శ్రీకృష్ణుడు, సత్యభామ (విష్ణు అంశ, భూదేవి) అవతారంలో నరకాసురుడితో యుద్ధం చేసి వధిస్తారు.  నరకుని పీడ విరగడైంది కావున ఇది  'నరక చతుర్దశి'.

దీపావళీ :

నరకుని బాధల నుండి విముక్తి లభించిన ఆనందంలో దీపావళిని జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. మరో కథ ప్రకారం రావణ సంహారం తర్వాత శ్రీసీతారాములు అయోధ్యకు వచ్చిన రోజు కూడా దీపావళి అని అంటారు. దీపావళీ రోజు శ్రీలక్ష్మీపూజలు చేస్తారు. వ్యాపారస్తులు కొత్త లెక్కలు ప్రారంభిస్తారు.

బలిపాఢ్యమి :

వామనావతారంలో శ్రీమన్నారాయణుడు బలి చక్రవర్తిని 'మూడు అడుగుల' నేలను దానమడిగాడు. వామన వటువుకు దానమిచ్చాడు బలి, "ఇంతింతైవటుడిం తైనభో రాశిపైనల్లంతై" అన్నట్లుగా ఒక పాదంతో భూమిని, ఇంకో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించిన 'త్రివిక్రముడు' వేరొక పాదంతో బలిని పాతాళానికి అణిచాడు. సంవత్సరానికి ఒకసారి బలి పాడ్యమి రోజున బలి భూలోకానికి వచ్చి ఇక్కడి దీపకాంతులను చూసి మనమంతా సుఖశాంతులతో వుండాలని ఆశీర్వదించి వెలతాడట ఇదీ ఆయనకు వామనుడిచ్చిన వరం. ఈరోజు దీపావళి తర్వాతి రోజు. అంటే కార్తీక పాడ్యమి. 

భగిని హస్తభోజనం (యమద్వితీయ) :

సూర్య భగవానుడికి యముడు, శనిదేవుడు ఇద్దరు పుత్రులు. యమున అనే ఒక పుత్రిక కలదు. యముడు, యమున ఇద్దరూ అన్నా చెల్లెలు. యముడు తన కర్తవ్య దీక్ష వల్ల చాలాకాలంగా తన చెల్లి ఇంటికి వెళ్లలేకపోతాడు. దీంతో యమున అన్నను బతిమాలింది ఒకసారి మా ఇంటికిరా అన్నయ్యా అని, దీంతో యముడు కార్తీక ద్వితీయనాడు తన చెల్లి ఇంటికి వెళ్తాడు. అక్కడ చెల్లి ఇచ్చిన గౌరవమర్యాదలను అందుకుని భోజనం చేసి వచ్చాడు యముడు. చెల్లెలైన యమున అన్నయ్యను ఒక వరం అడిగింది. ఎవరైతే  ఈ రోజు చెల్లెలింటికి వెల్లి చెల్లెలికి కట్నకానుక లిచ్చి వాల్లింట్లో భోజనం చేసి వస్తారో వారికి యముని బాధలు లేకుండా చేయి అని అడిగింది. భగినీ హస్తభోజనం అన్న పేరుతో ఉత్తర భారతంలో ఈ పండుగ ఇప్పటికీ జరుపుకొంటారు. ఇలా ఈ పండుగను ఐదురోజుల పాటు చేసుకుంటారు. 

ఇక పండుగ సందర్భంగా పిల్లలు చేసే సందడి అంతా ఇంతా కాదు.. టపాసుల మోతతో గ్రామాల నుంచి పట్టణాల వరకు అన్ని మిరుమిట్లుగొలిపే కాంతులతో అలరారుతుంటాయి.

- కేవీశర్మ

ఇవీ చ‌ద‌వండి ..


దీపావళిని ఏయే దేశాల్లో ఎలా జరుపుకుంటారో తెలుసా?

దీపావళి విశిష్టతలు ఇవే !