బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 14:39:27

విద్యా సంవత్సరం నష్టపోవద్దనే పాఠ్యపుస్తకాల పంపిణీ

విద్యా సంవత్సరం నష్టపోవద్దనే పాఠ్యపుస్తకాల పంపిణీ

మహబూబాబాద్ : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్య అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేస్తున్నారని గిరిజన  సంక్షేమ శాఖమంత్రి  సత్యవతి రాథోడ్ అన్నారు. కరోనా వల్ల పాఠశాలల ప్రారంభం ఆలస్యమవుతున్నందున.. విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ చేపట్టినట్లు చెప్పారు. ఈ పాఠ్యపుస్తకాలను వినియోగించుకుని బాగా చదువుకోవాలని  విద్యార్థులకు సూచించారు. మహబూబాబాద్ జిల్లా ఉన్న పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను మంత్రి  పంపిణీ చేశారు. జిల్లాలో 94 శాతం పాఠ్య పుస్తకాలు ఇప్పటికే వచ్చాయని, మిగిలినవి కూడా వెంటనే వస్తాయని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

కరోనా మహమ్మారి తగ్గగానే ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించడం, అక్కడ విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు.  కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు చేపడుతున్నామని, ప్రజలు కూడా సహకరించి, నివారణ చర్యలు పాటించాలన్నారు.  కరోనా నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నారని, అయితే గ్రామీణ ప్రాంతాల్లో సరైన్ ఆన్ లైన్ వసతులు లేకుండా విద్యార్థులు నష్టపోయే ప్రమాదముందన్నారు. దీనిని నివారించేందుకే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని, టీ – సాట్, లోకట్ టీవీల ద్వారా ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. 

రాష్ట్రంలో నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు సీఎం కేసీఆర్ ఈచ్ వన్ టీచ్ వన్ అనే గొప్ప కార్యక్రమాన్ని పెట్టారని, ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వాములై నిరక్షరాస్యతను నిర్మూలించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీచైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, స్థానిక అధికారులు, నేతలు పాల్గొన్నారు.


logo