ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 02:05:52

అమ్మకు దీర్ఘాయుష్షు!

అమ్మకు దీర్ఘాయుష్షు!

  • రాష్ట్రంలో తగ్గిన ప్రసూతి మరణాలు
  • తక్కువ మరణాలున్న రాష్ర్టాల్లో 4వ స్థానం
  • సంజీవనిగా మారిన కేసీఆర్‌ కిట్‌, అమ్మ ఒడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేసీఆర్‌ కిట్‌.. అమ్మకు దీర్ఘాయుష్షు పోస్తున్నది.. అమ్మ ఒడి పథకం తల్లిలా అండగా నిలుస్తున్నది.. కల్యాణలక్ష్మి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహిళాసంక్షేమ పథకాలు ప్రసూతి మరణాలకు అడ్డుకట్ట వేస్తున్నాయి. ఈ విషయాలను రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక కూడా స్పష్టం చేస్తున్నది. దేశంలో లక్ష ప్రసవాలకు నమోదవుతున్న మరణాల సంఖ్య సగటున 113 ఉండగా, తెలంగాణలో 63గా నమోదైంది. మొత్తం రాష్ర్టాల్లో పరిశీలిస్తే తక్కువగా మరణాలు నమోదైన రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నది. గత ఆరేండ్ల కాలంలో రాష్ట్రంలో ప్రసూతి మరణాలు బాగా తగ్గుతున్నాయి. 2014-16 మధ్య ప్రతి లక్ష ప్రసవాలకు 81 మరణాలు చోటుచేసుకోగా, 2016-18 నాటికి ఆ సంఖ్య 63కు పడిపోయింది. ప్రసూతి మరణాల రేటును 3.1కి తగ్గించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించగా, తెలంగాణలో ప్రసూతి మరణాల రేటు దానికి దగ్గరగా, 3.6గా ఉండటం గమనార్హం. 

అండగా అమ్మ ఒడి, కేసీఆర్‌ కిట్‌

ప్రసూతి మరణాలు తగ్గించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక సంక్షేమ పథకాలను ప్రారంభించింది. ప్రసూతి వైద్యసేవలను మెరుగుపరిచింది. వంద శాతం డెలివరీలు ప్రభుత్వ వైద్యుల చేతుల్లోనే జరగాలని రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మాతాశిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పుట్టిన ప్రతిబిడ్డ, కన్న తల్లి ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన కేసీఆర్‌ కిట్‌, అమ్మ ఒడి మహిళలకు వరంగా మారాయి. ఈ పథకాలు ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలను పెద్దమొత్తంలో పెంచాయి. స్థోమత లేని మహిళలే కాదు.. సాధారణ డెలివరీ కావాలనుకునే మహిళలు కూడా ఇప్పుడు ప్రభుత్వ దవాఖానల బాటపడుతున్నారు. ఫలితంగా సిజేరియన్‌ (సీ-సెక్షన్స్‌) రేటు తగ్గుముఖం పట్టింది. ఇక, 102 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయగానే అమ్మ ఒడి వాహనాలు తల్లులను దవాఖానలకు తీసుకువెళ్లేందుకు రెడీగా ఉంటున్నాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని గర్భిణీలకు ఈ వాహనాలు వరంగా మారాయి. కల్యాణలక్ష్మి పథకం అమ్మాయిలకు చిన్న వయసులో పెండ్లి కాకుండా అడ్డుకొని, పరోక్షంగా ప్రసూతి మరణాలను తగ్గిస్తున్నది.

లాక్‌డౌన్‌లోనూ కేసీఆర్‌ కిట్ల పంపిణీ 

కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనూ కేసీఆర్‌ కిట్ల పంపిణీలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నది. గత 6 నెలల్లో మొత్తం లక్షన్నర కిట్లను పంపిణీ చేసింది. డెలివరీ కోసం దవాఖానకు వచ్చే గర్భిణీకి ముందే కరోనా పరీక్షలు చేసి, తల్లీ బిడ్డ క్షేమంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నది.


తెలంగాణలో ప్రసూతి మరణాలు (లక్ష ప్రసవాలకు)

ప్రసూతి మరణాలు  అత్యధికంగా ఉన్న రాష్ర్టాలు (2016-18)

అసోం
215 
ఉత్తరప్రదేశ్‌
197
మధ్యప్రదేశ్‌
173 
రాజస్థాన్
164
మధ్యప్రదేశ్‌
173 logo