గురువారం 28 మే 2020
Telangana - May 20, 2020 , 16:57:17

తొర్రూరు, పెద్దవంగరలో ముస్లింలకు సరుకులు పంపిణీ

తొర్రూరు, పెద్దవంగరలో ముస్లింలకు సరుకులు పంపిణీ

మహబూబాబాద్‌ :  జిల్లాలోని తొర్రూరు, పెద్దవంగర మండల కేంద్రాల్లో రంజాన్‌ పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు నేడు ముస్లింలకు పండుగ రోజు వస్తువులతో కూడిన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ముస్లింలకు రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏ మత సారమైన దేవుడు ఒక్కడే అని. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, అందరి దేవుళ్లకు మొక్కుతానని తెలిపారు. ఒకరిద్దరు చేసిన తప్పులకు అందరినీ బాధ్యులను చేయొద్దన్నారు. 


కరోనాతో కలిసి జీవాంచాల్సిందేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారన్నారు. కాగా కరోనా విషయంలో భయపడాల్సింది లేదన్నారు. అలాగని నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే సమీపంలోని ప్రభుత్వ వైద్యులని సంప్రదించాలన్నారు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న అద్భుత సాహసోపేత నిర్ణయాలే ఇవాళ మనల్ని ఈ స్థితిలో ఉంచాయన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రజల ప్రణాలే ముఖ్యమని ముందుకెళ్లారన్నారు. ముస్లింలకు పండుగ కానుకలు అందజేసిన డాక్టర్‌ సోమేశ్వరరావును మంత్రి అభినందించారు. దాతలు ముందుకు రావడం వల్లే తాను తన ట్రస్ట్‌ తరపున ఇతరుల పక్షాన వేలాది మంది కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయగలుగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
logo