గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 17, 2020 , 16:45:45

రాష్ర్ట‌ మ‌త్స్య‌కారుల‌కు 24న రొయ్య పిల్ల‌ల పంపిణీ : మ‌ంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌

రాష్ర్ట‌ మ‌త్స్య‌కారుల‌కు 24న రొయ్య పిల్ల‌ల పంపిణీ : మ‌ంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌

హైద‌రాబాద్ : ఈ నెల 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మత్స్యకారుల‌ను ఆర్ధికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతను అందిస్తూ ప్రోత్సహిస్తుందన్నారు. ఈ సంవత్సరం 10.40 కోట్ల రూపాయల ఖర్చుతో 47 రిజర్వాయర్‌లు, 45 చెరువులలో 5 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేయనున్నట్లు చెప్పారు. రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక‌ ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని కోరారు. 

మత్స్యకారులకు అదనపు ఆదాయం సమకూర్చాలనే ఆలోచనతో 2017-18 సంవత్సరం నుండి ఉచితంగా మంచినీటి రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటలలో చేప పిల్లలు, రొయ్య పిల్లలను విడుదల చేయడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పారు. గ‌డిచిన మూడు సంవత్సరాలలో రూ. 14 కోట్లు ఖర్చు చేసి 7.69 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేయగా.. 51.50 కోట్ల రూపాయల విలువైన రొయ్యల ఉత్పత్తి జరిగిందన్నారు. దీంతో సుమారు 30 వేల మత్స్యకార కుటుంబాల ఆదాయం కూడా గడిచిన 3 సంవత్సరాలలో రెట్టింపు అయిందని, ఇది ఎంతో సంతోషక‌ర‌మ‌ని విష‌య‌మ‌ని మంత్రి అన్నారు.