బుధవారం 03 జూన్ 2020
Telangana - Mar 31, 2020 , 02:49:19

ఆత్మీయ ఆతిథ్యం!

ఆత్మీయ ఆతిథ్యం!

  • వలస కూలీలకు ఊరూరా సాయం.. భోజనం పెట్టి నిత్యావసరాల పంపిణీ
  • సీఎం కేసీఆర్‌ పిలుపునకు భారీ స్పందన.. ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ.500
  • ఎక్కడికక్కడే వలస కూలీలకు అందజేత.. కేసీఆర్‌ నిర్ణయానికి దేశవ్యాప్త ప్రశంసలు

ఒక్క పిలుపు.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి! తెలంగాణ రాష్ట్ర సాధనకు లక్షల మందిని కదిలించిన సమ్మోహనశక్తి! మళ్లీ అదే పిలుపు..  లక్షల మంది వలస కూలీల ఆకలి తీర్చుతున్న ఆత్మీయత! ఊరుకాని ఊరిలో మేమున్నామనే భరోసా! ఉద్యమమైనా, ఆతిథ్యమమైనా..సీఎం కేసీఆర్‌ పిలుపుతో లక్షల మంది కదులుతున్నారు! ఉపాధి కోసం రాష్ర్టానికి వచ్చి లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందిపడుతున్న వలస కూలీలకు ఊరూరా ఊహించని సాయం అందుతున్నది. కడుపు నింపుతూ కనీస వసతులు కల్పించేందుకు మేమున్నామంటూ ఔత్సాహికులు ముందుకొస్తున్నారు. తోచిన సాయం చేస్తూ తోబుట్టువుల్లా అండగా నిలబడ్డారు. మరోవైపు సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సోమవారం వలస కూలీలకు ఒక్కొక్కరికి రూ.500, 12 కిలోల బియ్యాన్ని అధికారులు అందజేస్తున్నారు. వలస కూలీలను తెలంగాణ రాష్ట్ర డెవలప్‌మెంట్‌ పార్ట్‌నర్లుగా చూస్తున్నామని, వారికి ఏ కష్టం రాకుండా కడుపులో పెట్టుకొంటామన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తున్నది. దేశంలో ఏ రాష్ట్రప్రభుత్వం కూడా వలస కూలీలపై మానవీయకోణంలో స్పందించలేదని, సీఎం కేసీఆర్‌ స్పందించిన తీరుపై అభినందనలు, ప్రశంసలు తెలుపుతూ పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రిగా పాటించాల్సిన ధర్మాలు ఏమిటో మిగతా సీఎంలు తెలుసుకోవాలని, తెలంగాణ ప్రజలు సరైన నాయకుడిని ఎన్నుకున్నారంటూ తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు.

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: రాష్ట్రంలో ఉపాధి కోసం వచ్చిన వలస కూలీలు లాక్‌డౌన్‌ కారణంగా ఆకలితో అలమటించద్దని, వారికి అం డగా నిలువాలన్న చేయాలన్న సీఎం కేసీఆర్‌ పిలుపునకు అనూహ్య స్పందన వచ్చింది. ఊరూవాడా తేడా లేకుండా స్వచ్ఛంద సంస్థలు, స్థానిక నాయకులు, ఔత్సాహికులు తమవంతు సాయం చేస్తున్నారు. నిత్యావసరా లు అందజేస్తూ, భోజనవసతి కల్పిస్తూ త్యాగనిరతి చాటుకుంటున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో వలస కూలీలకు ఒక్కొక్కరికి రూ.500, పన్నెండు కిలోల బియ్యం పంపిణీ సోమవారం మొదలైంది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం బియ్యం పంపిణీలో నిమగ్నమైంది. ఫంక్షన్‌హాళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో వలస కూలీలకు వసతి కల్పించి భోజనం అందజేస్తున్నారు.

వలస కూలీలకు అన్నదానం

కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీ సమీపంలో డేరాలు వేసుకొని జీవిస్తున్న కర్ణాటక వలస కూలీలకు జ్యోతిష్మతి ఇంజినీరింగ్‌ కళాశాల చైర్మన్‌ జువ్వాడి సాగర్‌రావు సోమవారం అన్నదానం చేశారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో బొమ్మలు విక్రయిస్తూ జీవిస్తున్న 24 మంది వలస కార్మికులకు తిమ్మాపూర్‌ తాసిల్దార్‌ బండి రాజేశ్వరి అల్గునూర్‌ శివారులోని సీవోఈలో వసతి ఏర్పాట్లుచేశారు. హైదరాబాద్‌ నుంచి కాలినడకన వెళ్తున్న 32 మంది వలస కార్మికులను కరీంనగర్‌ ట్రాఫిక్‌ ఏసీపీ శంకర్‌రాజు, ట్రైనీ ఐపీఎస్‌ నికితాపంత్‌ అల్గునూర్‌ శివారులోని లక్ష్మీనర్సింహ గార్డెన్‌కు తరలించి భోజన వసతి కల్పించారు. మహారాష్ట్రలో పరిశోధన (రీసెర్చ్‌) కోసం వెళ్లిన హైదరాబాద్‌, వరంగల్‌ జిల్లాలకు చెందిన అగ్రికల్చర్‌ విద్యార్థులు తిరుగుప్రయాణంలో కరీంనగర్‌ జిల్లాలోనే అగిపోయారు. వీరందరికీ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కొండ సత్యలక్ష్మి గార్డెన్‌లో వసతి ఏర్పాటుచేశారు.

 యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండల పరిధి పంతంగి టోల్‌ప్లాజా వద్ద చెక్‌పోస్ట్‌ను సీపీ మహేశ్‌భగవత్‌ పరిశీలించారు. హైదరాబాద్‌ నుంచి  కూలీలు డీసీఎంలో సొంతూర్లకు వెళ్తుండగా ఆపి భోజనం ప్యాకెట్లు అందించి వెనుకకు పంపారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో 250 మంది వలస కార్మికులకు టీఆర్‌ఎస్‌ నాయకుడు బచ్చుపల్లి గంగాధర్‌రావు ఆహారం అందజేశారు. హాలియాలో బీహార్‌ కూలీలకు దివ్య రైస్‌ ఇండస్ట్రీస్‌ ఆర్థికసహకారంతో 75 కిలోల బియ్యాన్ని తాసిల్దార్‌ మంగా అందజేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ర్టాలకు చెందిన 100 మంది కార్మికులకు అధికారులు నిత్యావసరాలు అందజేశారు. 

వెల్లివిరిసిన సేవాభావం

మహారాష్ట్ర, బీహార్‌ కూలీలకు నిర్మల్‌  పోలీసులు స్థానిక దివ్యాగార్డెన్‌లో ఆశ్రయం కల్పించారు. ఎస్పీ శశిధర్‌రాజు ఆహార పొట్లాలు, తాగునీరు అందజేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ కూలీలకు దస్తురాబాద్‌లో రేషన్‌  బియ్యం పంపిణీచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇతర రాష్ర్టాల కార్మికులకు ఎస్పీ రాహుల్‌హెగ్డే ఆహార వస్తువులను అందజేశారు. 60 మంది వలస కార్మికుల కుటుంబాలకు పదిరోజులకు సరిపడా నిత్యావసర సరుకులను దాతలు గీతాభవన్‌, ఎన్‌వీఆర్‌ రావు గార్డెన్స్‌, హరికృష్ణ లాడ్జి, మహేశ్వరి మెడికల్‌ యజమానులు తీసుకొనిరాగా మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఏసీపీ లక్ష్మీనారాయణ అందించారు. మంచిర్యాల రైల్వేస్టేషన్‌ ఏరియాలో ఎమ్మెల్యే తనయుడు నడిపెల్లి విజిత్‌రావు భోజన వసతి కల్పించారు. జైపూర్‌ మండల కేంద్రంలో మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చిన ఏడు భవన నిర్మాణ కుటుంబాలకు 15 రోజులకు సరిపడా బియ్యం, సామగ్రిని పోలీసులు అందజేశారు. కోటపల్లి మండలం ఆలుగామలో రోడ్డు పనుల్లో పాల్గొంటున్న కూలీలకు ఎంపీపీ మంత్రి సురేఖ, సర్పంచ్‌ కుమ్మరి సం తోష్‌, ఎంపీటీసీ గోమాస రజిత నిత్యావసరాలు అందజేశారు. జనగామ జిల్లాలో జిన్నిం గ్‌, కాలువ, రైస్‌ మిల్లుల్లో పనిచేయడానికి వచ్చిన 1,447 మంది కార్మికులకు పరిశ్రమల యజమానులే వసతి, నిత్యావసరాలు కల్పించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.  

నిత్యావసరాల పంపిణీ

మెదక్‌ జిల్లాలోని తూప్రాన్‌ వద్ద వలస కార్మికుల కోసం రెండు ఫంక్షన్‌హాల్స్‌ను సిద్ధంచేసి 370 మందికి భోజన వసతి కల్పించారు. జాతీయ రహదారి చేగుంట వద్ద కాలినడకన వెళ్తున్న బాటసారులను గుర్తించి 100 మందికి భోజన ప్యాకెట్లను ఎమ్మెల్యే రామలింగారెడ్డి అందించారు. అటవీశాఖ అభివృద్ది సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి భవన నిర్మాణ కార్మికులకు బియ్యం పంపిణిచేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో బీహార్‌ వలస కూలీలకు రూ.5వేలు, 50కిలోల బియ్యాన్ని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అందజేశారు. వలస కార్మికులను ఆదుకునేందుకు శివరామకృష్ణ, శ్రీసాయి రైస్‌ మిల్‌ నిర్వాహకులు రాందాస్‌, పడిగెల శ్రీనివాస్‌ రూ.10 వేలను ఎమ్మెల్యేకు అందజేశారు. చల్‌గల్‌ వ్యవసాయమార్కెట్‌లో షెడ్ల కింద నివాసముంటూ జిల్లా కేంద్రంలో కూలి పనులు చేసుకుంటున్న 25 మంది అమరావతి, మహారాష్ట్రవాసులకు కలెక్టరేట్‌ ఏవో వెంకటేశ్‌ భోజనం పెట్టించి నిత్యావసరాలు అందించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రం లో హైదరాబాద్‌ నుంచి కాలినడకన వెళ్తున్న మధ్యప్రదేశ్‌ కూలీలకు జెడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి భోజనం పెట్టారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో కాగజ్‌నగర్‌లో పేదలకు సరుకుల పంపిణీ చేశారు. 


బియ్యం, నగదు అందజేత

మహబూబాబాద్‌ మండల పరిధిలో ని కొమ్ముగూడెం తండాలో మహారాష్ట్ర నుంచి మిర్చి ఏరేందుకు వచ్చిన వలస కూలీలకు ఒక్కొక్కరికి 12 కిలోల బి య్యం, రూ.500 నగదును సోమవారం గిరిజన స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అందజేశారు. జిల్లాలో 5,699 మంది కూలీలు 103 గ్రూపులుగా ఉన్నట్టు గుర్తించి, స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆవాసం కల్పించామని, ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం, రూ. 500 నగదు అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌, కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ పాల్గొన్నారు. వరంగల్‌కు వలస వచ్చిన కొంతమంది కూలీలకు వరంగల్‌ అర్బన్‌ జిల్లా వడ్డేపల్లిలోని స్వగృహంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ భోజన వసతి ఏర్పాటుచేశారు. కూలీలకు రూ.500, 12 కిలోల బియ్యాన్ని అందజేస్తున్నామని చెప్పారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం చిట్కుల్‌లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, కలెక్టర్‌ హనుమంతరావు కూలీలకు 12 కేజీల చొప్పు న బియ్యం రూ.500 అందజేశారు. ఆదిలాబాద్‌ జిల్ల్లావ్యాప్తంగా 113 మంది వలస కార్మికులకు అధికారులు, 13.56 క్వింటాళ్ల బియ్యం, రూ.56,500 పంపిణీ చేశారు. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని కేఆర్కే కాలనీలో మధ్యప్రదేశ్‌ వలస కార్మికులకు ఆదనపు కలెక్టర్‌లు సంధ్యారాణి, డేవిడ్‌ బియ్యం, డబ్బులు అందజేశారు. నిజామాబాద్‌ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో  కూలీలకు 12 కిలోల చొప్పున బియ్యం, రూ.500 నగదు  అందజేశారు.

సిరిసిల్ల బల్దియా ఔదార్యం

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉచిత భోజనం అందజేసేందుకు బల్దియా ముందుకొచ్చింది. మంత్రి కేటీఆర్‌ సూచనతో నిత్యం రూ.ఐదు వేలు భరిచేందుకు ముందుకొచ్చింది. హరేరామ స్వచ్ఛంద సేవాసంస్థతో కలిసి అన్నపూర్ణ క్యాంటీన్లతో రోజూ 200 మందికి భోజనం పెట్టాలని నిర్ణయించింది.  

రాజధానిలో 25 వేల మందికి

హైదరాబాద్‌లో భవన నిర్మాణ కూలీల కోసం 168 ప్రాంతాల్లో లేబర్‌ క్యాంపులను ఏర్పాటుచేశారు. ఆయా  నిర్మాణల వద్ద  క్యాంపులను ఏర్పాటుచేసి 25 వేల మందికిపైగా ఆశ్రయం కల్పించారు. అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా నగరవ్యాప్తంగా నిత్యం లక్ష మందికి భోజనవసతి కల్పిస్తున్నారు. 

నాయకత్వం అంటే ఇది

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన అద్భుతం.. నాయకత్వం అంటే ఇది. 

-సంజయ్‌బారు, మన్మోహన్‌సింగ్‌ మీడియా మాజీ సలహాదారు 

ట్రూ లీడర్‌.. సీఎం కేసీఆర్‌

సీఎం కేసీఆర్‌ నిజమైన నాయకుడు.. ది ట్రూ లీడర్‌.. సెల్యూట్‌. 

- సోనూసూద్‌, ప్రముఖ సినీనటుడు


logo