మంగళవారం 19 జనవరి 2021
Telangana - Jan 12, 2021 , 15:24:20

ఫిబ్ర‌వ‌రిలోపు డైరీ యూనిట్ల పంపిణీ: మంత్రి కొప్పుల ఈశ్వర్

ఫిబ్ర‌వ‌రిలోపు డైరీ యూనిట్ల పంపిణీ: మంత్రి కొప్పుల ఈశ్వర్

హైద‌రాబాద్ : ఫిబ్రవరిలోపు డైరీ యూనిట్ల పంపిణీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ ఆదేశించారు.  నూతనంగా అందించే పశువులకు ఇన్సూరెన్స్, ట్యాగింగ్, వాటరింగ్ , ఫుడ్, షేడ్స్, ఇతర అంశాలు ప‌శు సంవ‌ర్ధ‌క‌శాఖ అధికారులు, సిబ్బంది లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. జ‌గిత్యాల జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పైలెట్ ప్రాజెక్టు కింద పశువుల పంపిణీ గ్రౌండింగ్ అంశంపై సంబంధిత అధికారులతో మంత్రి మంగ‌ళ‌వారం వీడియో  కాన్ఫరెన్సు  నిర్వహించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో డైరీ యూనిట్ల పంపిణీ గ్రౌండింగ్ త్వరితగతిన చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో  రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం ఏర్పాటు చేయాలని గమనించి ప్రత్యేక చొరవతో పైలెట్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టిన‌ట్లు తెలిపారు. ధర్మపురి నియోజకవర్గం పరిధిలోని ధర్మారం మండలంలో పైలెట్ ప్రాజెక్టుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి 40 లబ్ధిదారులను ఎంపిక చేసిన‌ట్లు చెప్పారు. 

ఎస్సీ కార్పొరేషన్ సంస్థ ద్వారా 40 మంది లబ్దిదారులను ఎంపిక చేసి వారికి రూ.4 లక్షల వ్యయంతో 4 పశువులను ఒక యూనిట్‌గా (సబ్సిడీ రూ.2.4 లక్షలు) లబ్దిదారులకు అందించడం జరుగుతుందన్నారు. 40 లబ్దిదారుల్లో 34 మంది లబ్దిదారుల డాక్యుమెంటేషన్ పూర్తయిందని, పెండింగ్‌లో ఉన్న డాక్యుమెంటేషన్ ప్రక్రియ త్వరగా  పూర్తి చేయాలనే బ్యాంకర్లకు మంత్రి సూచించారు. 

ప్రజల ఆదాయం పెంపొందించడానికి రూపొందించిన పథకంలో అవకతవకలు జరగడానికి వీల్లేద‌ని మంత్రి అన్నారు. లబ్దిదారులకు  పంపిణీ చేసిన పశువులను మళ్ళీ విక్రయించడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని మంత్రి  స్పష్టం చేశారు.  ఎంపీడీవోలు లబ్దిదారులు, బ్యాంకర్లను సమన్వయం చేసుకుంటూ యూనిట్ల గ్రౌండింగ్ త్వరగా అయ్యేలా చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు. అదనపు కలెక్టర్ లక్ష్మినారాయణ, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి శంకర్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి సుగుణ, ఈడీ ఎస్సీ కార్పోరేషన్, సంబంధిత అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.