బుధవారం 03 జూన్ 2020
Telangana - May 10, 2020 , 01:25:50

నేడు ఐదు టన్నుల బత్తాయిల పంపిణీ

నేడు ఐదు టన్నుల బత్తాయిల పంపిణీ

  • బత్తాయి పండుగకు ఎంపీ సంతోష్‌కుమార్‌ పిలుపు
  • కదిలిన టీఆర్‌ఎస్‌ నేత, ఉప్పల ఫౌండేషన్‌ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా

ఎల్బీనగర్‌, నమస్తే తెలంగాణ: రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ఆదివారం(మే 10న) బత్తాయి దినోత్సవాన్ని జరుపుకోవాలని ఇచ్చిన పిలుపుమేరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా ఐదు టన్నుల బత్తాయిలు పంచేందుకు ఉప్పల ఫౌండేషన్‌ చైర్మన్‌, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్‌ (ఐవీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా సిద్ధమయ్యారు. బత్తాయి దినోత్సవం రోజున రైతులకు అండగా నిలుస్తూ బత్తాయిలను కొనుగోలుచేసి పేదలకు పంచాలని సంతోష్‌కుమార్‌ సూచించిన నేపథ్యంలో శ్రీనివాస్‌గుప్తా పెద్దఎత్తున పండ్లను సేకరించి నాగోలు శివఫంక్షన్‌హాల్‌లో భద్రపరిచారు. పండ్లను ప్యాక్‌చేసి ఆదివారం పంచేందుకు అంతా సిద్ధంచేశారు. బత్తాయిలను తినడం ద్వారా రోగ నిరోధకశక్తి పెరిగేందుకు అవకాశం ఉన్నదని, తాము గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పండ్లను పంచేందుకు సిద్ధమవుతున్నామని శ్రీనివాస్‌గుప్తా తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో తమ శాఖల ద్వారా జిల్లాకు టన్ను పంపిణీచేయనున్నట్టు పేర్కొన్నారు. 

లాక్‌డౌన్‌లో నిత్యావసరాలు, ఆహార ప్యాకెట్ల పంపిణీ లాక్‌డౌన్‌లో వలస కార్మికులు, పేదలు ఆకలితో అలమటించకుండా చూడాలని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ఉప్పల ఫౌండేషన్‌ తరపున ఉప్పల శ్రీనివాస్‌గుప్తా కుటుంబసభ్యులు పెద్దఎత్తున నిత్యావసరాలు, ఆహార ప్యాకెట్ల పంపిణీ చేపట్టారు. లాక్‌డౌన్‌ నాటినుంచి ప్రతిరోజూ నాగోలు కేంద్రంగా రెండువేల ఆహార పొట్లాలను  గ్రేటర్‌ హైదరాబాద్‌వ్యాప్తంగా నిత్యం 300 మందికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు. శ్రీనివాస్‌గుప్తా సతీమణితోపాటు ఇద్దరు కుమారులు కూడా ఈ క్రతువులో నిత్యం నిమగ్నమవుతున్నారు. ఐవీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీనివాస్‌గుప్త్తా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఐవీఎఫ్‌శాఖల ద్వారా నిత్యం పేదలను ఆదుకునేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఎంపీ సంతోష్‌కుమార్‌ ఇచ్చిన గ్రీన్‌చాలెంజ్‌ పిలుపును అందుకుని పెద్దసంఖ్యలో మొక్కలు నాటారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కూడా ఉప్పల శ్రీనివాస్‌గుప్తాతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి తెలంగాణలో చేస్తున్న సేవాకార్యక్రమాలను అభినందించడంతోపాటుగా కరోనా కట్టడికి సీఎం కేసీఆర్‌ చేస్తున్నకృషిని ప్రశంసించారు.


logo