గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 01:27:30

కృత్రిమ గర్భానికీ దూరం

కృత్రిమ గర్భానికీ దూరం

  • l దంపతుల కలకు అడ్డుగా కరోనా
  • l ఏడాదిపాటు వాయిదాకు మొగ్గు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా భయం అమ్మతనాన్నీ వెంటాడుతున్నది. కండ్లు తెరిచి కొత్త లోకాన్ని చూడాల్సిన పిల్లలు.. కొవిడ్‌ కష్టాలు పడొద్దని జంటలు భావిస్తున్నాయి. కరోనా కాలంలో పిల్లలను కనేందుకు విముఖత చూపుతున్నాయి. ‘అమ్మా.. నాన్న’ అని పిలిపించుకోవాలని మనసు ఎంత ఆరాటపడుతున్నా.. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రెగ్నెన్సీని తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో టెస్ట్‌ట్యూబ్‌ బేబీ వంటి కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో(ఐవీఎఫ్‌) తల్లిదండ్రులు కావాలనుకునే జంటలు కూడా తమ నిర్ణయాన్ని కొన్నాళ్లపాటు వాయిదా వేసుకుంటున్నారు. ‘మా కలల పంట ఈ కరోనా కష్టాల మధ్య పెరుగటం కన్నా కొన్నాళ్లు వాయిదా వేయడం ఉత్తమం’ అని చాలా మంది భావిస్తున్నారు. డాక్టర్లు సైతం ఈ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు. కృత్రిమ గర్భదారణ పద్ధతుల్లో స్త్రీ, పురుషుల నుంచి అండాలు, వీర్యకణాలు సేకరించి, ల్యాబ్‌లో ఫలదీకరణం చేసి, కొన్నాళ్లపాటు ఎదగనిస్తారు. ఆ తర్వాత పిండాన్ని తిరిగి తల్లి గర్భాశయంలోకి ప్రవేశపెడుతారు. ఈ క్రమంలో ఎవరికి కరోనా సోకినా నష్టం భారీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొందరు డాక్టర్లు కొన్నాళ్లపాటు ఐవీఎఫ్‌లను వాయిదా వేస్తున్నారు. పిండాలను, వీర్యకణాలను, అండాలను గడ్డకట్టించి కొన్నేండ్లపాటు ల్యాబ్‌లోనే నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని వైద్యనిపుణులు చెప్తున్నారు.

ఇప్పుడే కనొద్దనుకుంటున్నారు

కొందరు దంపతులు ఫోన్‌ చేసి ప్రెగ్నెన్సీని కొన్నాళ్లపాటు ఎలా వాయిదా వేసుకోవచ్చో సలహాలు అడుగుతున్నారు. అందుబాటులో ఉన్న మార్గాల గురించి చెప్తున్నాం. కృత్రి మ గర్భధారణకు సంబంధించి వాయిదా వేసుకోవాలని మేమే స్వయంగా సలహా ఇస్తున్నాం. కరోనా సోకినవారి అండంగానీ వీర్యకణాలు గానీ ఒక్కసారి ల్యాబ్‌కు చేరితే అందులో ఉన్న పిండాలు, సేకరించిన అండాలు, వీర్యకణాలను పడేయాల్సి వస్తుంది. ఇది ఎంతో మంది జీవితాలకు సంబంధించిన విషయం.

- డాక్టర్‌ గీతాంజలి, గైనకాలజిస్ట్‌, 

బృందావన్‌ హాస్పిటల్‌, ఈస్ట్‌మారేడుపల్లిlogo