మంగళవారం 26 మే 2020
Telangana - May 09, 2020 , 04:51:16

కోటి మందికి షాక్‌!

కోటి మందికి షాక్‌!

  • కేంద్రం బిల్లుతో గృహ విద్యుత్‌కు విఘాతం
  • క్రాస్‌ సబ్సిడీలు రద్దు, సబ్సిడీలు అగమ్యగోచరం
  • యూనిట్‌కు వాస్తవ ధరతో పూర్తి బిల్లు చెల్లించాల్సిందే!
  • పేదలు, బలహీనవర్గాలపై రూ.240 కోట్ల వరకు భారం   

తెలంగాణలో ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త. గాలివాటుకే పోయిన కరెంటు ఎప్పుడొస్తుందో తెలియని పల్లెలు! ఏ ట్రాన్స్‌ఫారమో తగులబడిపోతే దిక్కేలేదు! పగలు రాత్రి తేడాలేకుండా గంటల తరబడి ఉక్కపోతలో ఉక్కిరిబిక్కిరయ్యే నగరాలు! ఇదేసందుగా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లిన ఇన్వర్టర్లు, జనరేటర్ల దందా! ఇప్పుడు.. తెలంగాణలో కరెంటు పోతే వార్త! కరెంటు పోయిందని అనుకునేలోపే గిరగిరా తిరిగే ఫ్యాన్లు! రైతులకు ఉచిత విద్యుత్‌.. బలహీనవర్గాల వారు వాడుకునే గృహ విద్యుత్‌కు సబ్సిడీ! ఫ్యాక్టరీల్లో నిత్యం తిరిగే యంత్రాలు! తెలంగాణ వస్తే అంధకారమేనన్న శాపాలను అధిగమించి రాష్ట్రమంతటా విద్యుత్‌ ధగధగలు!కానీ.. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త కరెంటు చట్టం రైతులు, గృహ విద్యుత్‌ వినియోగదారులు.. పారిశ్రామికవేత్తలే కాదు.. దాదాపు అన్ని రంగాలను ప్రభావితం చేయనున్నది!  ప్రత్యేకించి ఇంటి కరెంటుకు పెద్ద షాక్‌ తగులబోతున్నది! సబ్సిడీలు మాయమై భారీ బిల్లులు చెల్లించాల్సిన దుస్థితికి నెట్టబోతున్నది! 


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశంలో గృహ విద్యుత్‌ వినియోగదారులకు గడ్డురోజులు రానున్నాయా? కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ చట్టం -2020 ముసాయిదా బిల్లును పరిశీలిస్తే.. ఈ అనుమానం నిజమేననిపిస్తున్నది. ఆ బిల్లు ప్రకారం గృహ వినియోగదారులు తాము వినియోగించే ప్రతి యూనిట్‌కు పూర్తిస్థాయి బిల్లును చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం దయతలిస్తే తప్ప వినియోగదారులకు విద్యుత్‌ బిల్లుపై సబ్సిడీ లభించే అవకాశం లేదు. తెలంగాణలో ప్రస్తుతమున్న 97.6 లక్షలమంది గృహ వినియోగదారులు తాము వినియోగించే యూనిట్ల ప్రకారం నిర్దేశించిన శ్లాబ్‌ ఆధారంగా లభించే సబ్సిడీని పొందుతూ బిల్లులు చెల్లిస్తున్నారు. రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను వినియోగిస్తున్న వారందరూ సబ్సిడీని పొందుతున్నారు. కానీ కేంద్రం రూపొందించిన బిల్లు అమలులోకి వస్తే ఆ సబ్సిడీలు రద్దయిపోతాయి. విద్యుత్‌ ఉత్పత్తికి అయ్యే ఖర్చు, సరఫరా నష్టాలు, ఉద్యోగుల జీతభత్యాలు, ఇతరత్రా ఖర్చులన్నీ కలుపుకొని అయ్యే మొత్తం వ్యయం ఆధారంగా యూనిట్‌ ధరను నిర్ణయిస్తారు. దీంతో ఇప్పటివరకూ సబ్సిడీని పొందుతున్న వారందరూ భారీ మొత్తంలో బిల్లుల భారాన్ని మోయాల్సి వస్తుంది. 

విద్యుత్‌ సవరణల బిల్లు

కేంద్రం ప్రతిపాదించిన బిల్లులోని నిబంధనల ప్రకారం.. ప్రతి వినియోగదారుడు ముందుగా తాను వినియోగించిన విద్యుత్‌ మొత్తానికి బిల్లు చెల్లించాలి. ఆ తరువాత అతడు ప్రభుత్వంఇచ్చే సబ్సిడీకి అర్హుడైతే.. ఆ మొత్తాన్ని డీబీటీ (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) రూపంలో అతని బ్యాంక్‌ ఖాతాలో జమచేస్తారు. ప్రస్తుతం విద్యుత్‌ ఉత్పత్తి వ్యయానికి, గృహ వినియోగదారులు చెల్లిస్తున్న యూనిట్‌ ధరకు మధ్య చాలా తేడా ఉన్నది. ఆ వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో కొంత, క్రాస్‌ సబ్సిడీతో మరికొంత భర్తీ చేస్తున్నారు. తాజా బిల్లు ప్రకారం క్రాస్‌ సబ్సిడీ మొత్తాన్ని రద్దుచేయనున్నారు. కొత్త విధానంలో ప్రభుత్వం ఏమేరకు సబ్సిడీ వస్తుందో తెలియని పరిస్థితి. మొత్తంగా కేంద్ర ప్రాతిపాదిత బిల్లు గృహ వినియోగదారులకు పిడుగుపాటుగా పరిణమించనుంది. 

రాష్ట్రంలో సబ్సిడీ పొందేవారు 97.6 లక్షలు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గృహ వినియోగదారులను వారు వినియోగించే విద్యుత్‌ ఆధారంగా 9 శ్లాబులుగా విభజించారు. రాష్ట్రంలో మొత్తం గృహ వినియోగదారులు 1,13,19,524 మంది ఉన్నారు. వీరిలోలో కాస్ట్‌ ఆఫ్‌ సర్వీసు (ఉత్పత్తి, ట్రాన్స్‌మిషన్‌ నష్టాలు, ఉద్యోగుల జీతభత్యాలు, ఇతరత్రా ఖర్చులు) కంటే తక్కువ ధరకు విద్యుత్‌ను పొందుతున్నవారు లేక సబ్సిడీని అనుభవిస్తున్నవారు 97,60,728 మంది. మొత్తం గృహ వినియోగదారుల్లో వీరి సంఖ్య 86 శాతం. నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగం ఆధారంగా వీరిని గుర్తించారు. వీరిలో అత్యధికులు పేదలు, బడగు బలహీనవర్గాల వారికి చెందినవారే ఉన్నారు. వీరు తాము వినియోగించే విద్యుత్‌ ఆధారంగా క్రాస్‌సబ్సిడీని, ప్రభుత్వం అందించే సబ్సిడీని పొందుతున్నారు.

కొత్త బిల్లుతో పెనుభారం

రాష్ట్రంలో ప్రస్తుతం 100 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ. 3.30 పైసల చొప్పున, 101-200 యూనిట్ల వరకు రూ. 4.30 పైసల చొప్పున బిల్లు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించేవారు ప్రతినెలా వందల రూపాయల సబ్సిడీని పొందుతున్నారు. అధికారిక సమాచారం ప్రకారం.. ఒక యూనిట్‌ వాస్తవ ధర (ఉత్పత్తి, ట్రాన్స్‌మిషన్‌ నష్టాలు, ఉద్యోగుల జీతభత్యాలు, ఇతరత్రా ఖర్చులు కలుపుకొని) రూ. 6.87 పైసలు. కానీ రాష్ట్రంలోని 97.6 లక్షలమంది గృహ వినియోగదారులు వాస్తవ ధరకంటే తక్కువే చెల్లిస్తున్నారు. ఉదాహరణకు, గృహ వినియోగదారుడు ఒక నెలలో 190 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తే.. 100 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ. 3.30 పైసల చొప్పున.. ఆపై 101 నుంచి 200 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ. 4.30 పైసల చొప్పున మొత్తం రూ. 717 అవుతుంది. ఇందులో సర్వీస్‌ చార్జీలు, ఇతరత్రా చార్జీలు కలుపుకొని మొత్తం బిల్లు రూ. 778.41 పైసలు వస్తుంది. కొత్త బిల్లు ప్రకారం.. 190 యూనిట్లకు వాస్తవ ధరను యూనిట్‌కు రూ.6.87 పైసల చొప్పున వేస్తారు. ఇది రూ. 1305.30 పైసలు అవుతుంది. దీనికి సర్వీస్‌, ఇతర చార్జీలు కలుపుకొని మొత్తం రూ.1366.70 వస్తుది. ప్రస్తుతం సబ్సిడీ ఆధారంగా కడుతున్న బిల్లుకు, ఇకపై వాస్తవ ధరలో కట్టాల్సిన బిల్లుకు మధ్య తేడా రూ.588.29 పైసలు. ప్రస్తుతం ఈ మొత్తాన్ని గృహ వినియోగదారుడు క్రాస్‌ సబ్సిడీ ద్వారా, ఇటు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ద్వారా పొందుతున్నాడు. ఇకపై క్రాస్‌ సబ్సిడీ రద్దయి, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఎంతో తెలియకపోతే.. ఆ మొత్తం అదనంగా కట్టాల్సి ఉంటుంది. నెలకు 50 యూనిట్ల వరకు వినియోగించేవారిపై కూడా అదనంగా రూ. 178 వరకు భారం పడుతుంది. మురికివాడలు మొదలుకొని దిగువ మధ్యతరగతివారి వరకు 200 యూనిట్లలోపు వినియోగించేవారందరూ.. సగటున నెలకు అదనంగా రూ.250 కట్టాల్సి వచ్చినా.. అది రూ.240 కోట్ల వరకు చేరుతుంది. రాష్ట్రంలోని 97.6 లక్షల మంది గృహ వినియోగదారులకు ఇది మోయలేని భారంగా పరిణమించనుంది.


logo