గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 03:48:46

జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఏర్పాటు

జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఏర్పాటు

పీవీ నరసింహారావు ప్రభుత్వం మానవ హక్కుల పరిరక్షణ రంగంలో వేసిన ఒక ముందడుగు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఏర్పాటు. 1993 అక్టోబర్‌ 12న ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ఒడంబడికలు, భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కుల పరిరక్షణకు, ఉన్నతికి ఈ కమిషన్‌ పాటుపడుతుంది. మానవహక్కుల పరిరక్షణ కోసం ఈ కమిషన్‌ నిర్వహించే విధులు విస్తృతంగా ఉన్నాయి. ప్రభుత్వం లేదా ప్రభుత్వ ఉద్యోగి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన ఆరోపణలపై కమిషన్‌ దర్యాప్తు జరుపుతుంది. హక్కుల పరిరక్షణ చర్యల అమలుకు తగిన సూచనలు చేస్తుంది. ఉగ్రవాదంతో సహా ఏ రూపేణ హక్కులకు భంగం కలిగినా అందుకు కారణాలను సమీక్షించి, నిరోధక చర్యలను సూచిస్తుంది. మానవ హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ ఒడంబడికలను అధ్యయనం చేసి వాటిని అమలు చేయడానికి సూచనలు చేస్తుంది. మానవ హక్కుల అంశంపై అధ్యయనాలను ప్రోత్సహిస్తుంది. కారాగారాలను సందర్శించి ఖైదీల పరిస్థితిని పరిశీలిస్తుంది. సమాజంలోని భిన్నవర్గాల్లో మానవహక్కుల విద్యను ప్రచారం చేయడానికి కృషిచేస్తుంది. ఈ హక్కుల పరిరక్షణల విధానాలను ప్రచారం చేయడానికి ప్రచురణలు చేపడుతుంది. మీడియా, సదస్సులు తదితర మార్గాల ద్వారా ప్రచారం చేస్తుంది. మానవహక్కుల రంగంలో సేవ చేయడానికి స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహిస్తుంది. కమిషన్‌ ఏర్పాటుకు జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు దోహదపడ్డాయి. ఈ కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి పార్లమెంటు ద్వారా చట్టం చేయ డం ఆలస్యమైంది. మొదట పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టారు. కానీ ఈ బిల్లు ఆ శించినంత పదును లేదని పార్లమెంటులో లోపల, బయట విమర్శలు వచ్చాయి. 

ఆర్డినెన్స్‌ ద్వారా కమిషన్‌ ఏర్పాటు

అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన వెలువడి 45 ఏండ్లు అవుతున్న సందర్భంగా సాధ్యమైనంత తొందరగా ఈ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని పీవీ ప్రభుత్వం భావించింది. తొలుత ఆర్డినెన్స్‌ ద్వారా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అప్పటికే 1980, 90 దశకాలలో పంజాబ్‌, కశ్మీర్‌, ఈశాన్య రాష్ర్టాల సంక్షోభాలు చెలరేగాయి. పంజాబ్‌లో ఉగ్రవాదం పంజా విసిరింది. మరోవైపు ఉగ్రవాదాన్ని, ఇతర ఆందోళనలను అణచివేయడానికి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించిందనే ఆరోపణలు వచ్చా యి. ఈ నేపథ్యంలో మానవ హక్కుల కమిషన్‌ ఏర్పాటైంది. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ చట్టానికి ఆ తర్వాత సవరణలు కూడా జరిగాయి. అయినప్పటికీ కమిషన్‌ పరిధి, అధికారాలు పరిమితంగా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. బాధితులకు పరిహారం చెల్లించవలసిందిగా ప్రభుత్వాన్ని కమిషన్‌ ఆదేశించవచ్చు. హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన అధికారులపై చర్యలను సూచించవచ్చు. మానవ హక్కుల పరిరక్షణకు ఫలానా చర్యలు తీసుకోవాలని లేదా తీసుకోకూడదని సలహాలు ఇవ్వవచ్చు. అయితే కమిషన్‌ పాత్ర సలహాలకే పరిమితం అయి ఉంటుంది. కొన్ని ఎన్‌కౌంటర్లు బూటకమం టూ కమిషన్‌ ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టించింది. 2000-01లో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు 70వేల ఫిర్యాదులు వచ్చాయి. ఏదేమైనా ఈ కమిషన్‌ ప్రాధాన్యం విస్మరించలేనిది.logo