శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 19:12:30

వినోద్‌కుమార్‌తో దివ్యాంగుల సంస్థ చైర్మన్‌ వాసుదేవారెడ్డి భేటీ

వినోద్‌కుమార్‌తో దివ్యాంగుల సంస్థ చైర్మన్‌ వాసుదేవారెడ్డి భేటీ

హైదరాబాద్‌ : రాష్ట్ర వికలాంగుల కో - అపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ డా. కె.వాసుదేవరెడ్డి.. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోదకుమార్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా వాసుదేవారెడ్డి మాట్లాడుతూ రాష్ర్టంలో దివ్యాంగులకు పింఛన్‌ అందుతున్న తీరు, లభ్ధిపొందుతున్న వారి సంఖ్య తదితర విషయాలపై ఆయన వినోద్‌కుమార్‌తో చర్చించినట్లు తెలిపారు. 

రాష్ర్టంలోని సుమారు ఐదు లక్షల మంది దివ్యాంగులకు ఆసరా పథకం కింద నెలకు రూ. 3016 అందజేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని వాసేదేవారెడ్డి అన్నారు. కార్పొరేషన్ ద్వారా దివ్యాంగులకు ఏటా సహాయ ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శారీరక దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, త్రీవీల్‌ మోటార్‌వాహనాలు, అంధులకు ల్యాప్‌టాప్‌లు, మూగ, చెవిటి వారికి స్మార్ట్‌ఫోన్లు, మానసిక దివ్యాంగులకు ప్రత్యేక కిట్లు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. 

దీంతో పాటు దివ్యాంగులను వివాహం చేసుకుంటే ప్రోత్సాహక బహుమతి కింద గతంలో రూ. 50,000 ఇవ్వగా.. ప్రస్తుతం రూ.లక్ష అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగులకు సంక్షేమ కార్యక్రమాలు అందజేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్ర స్థానంలో ఉందని ఆయన వినోద్‌కుమార్‌ దృష్టికి తీసుకొచ్చారు. 

దివ్యాంగుల సంక్షేమానికి మరింత కృషి : వినోద్‌కుమార్‌

దివ్యాంగుల సంక్షేమం కోసం మరింత కృషి చేస్తామని, వారి సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo