గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Aug 01, 2020 , 15:33:33

ఎర్రబెల్లి విజ్ఞ‌ప్తి.. ముగ్గురు పిల్లలను దత్తత తీసుకున్న దిల్ రాజు

ఎర్రబెల్లి విజ్ఞ‌ప్తి.. ముగ్గురు పిల్లలను దత్తత తీసుకున్న దిల్ రాజు

హైద‌రాబాద్ : అనాథ పిల్ల‌ల బాధ్య‌త తీసుకోవాల్సిందిగా కోరిన రాష్ర్ట పంచాయ‌తీరాజ్‌శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు విజ్ఞ‌ప్తిపై సినీ నిర్మాణ దిల్ రాజు సానుకూలంగా స్పందించారు. దిల్ రాజు స్పంద‌న‌పై మంత్రి హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ అభినంద‌న‌లు తెలిపారు. ఘ‌ట‌న వివ‌రాలిలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు గ్రామ నివాసి గట్టు సత్తయ్య. అనారోగ్యం కార‌ణంగా గతేడాది సత్తయ్య చనిపోయాడు. దీంతో పిల్లలు మనోహర్, లాస్య, యశ్వంత్ బాధ్య‌త భార్య అనురాధపై ప‌డింది. కాగా భర్త చనిపోయిన బాధలో ఆమె కూడా మంచం పట్టింది. రెండు రోజుల క్రితం అనురాధ సైతం చనిపోయింది. గ్రామస్థులు, ఊరి పెద్ద‌లు చందాలు వేసుకుని అనురాధ అంత్యక్రియలు నిర్వహించారు.

తండ్రి, తల్లి చనిపోవడంతో పిల్లలు అనాథలుగా మారారు. వీరి ధీన స్థితిపై వార్త క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. ఇది గ‌మ‌నించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చలించిపోయారు. వెంటనే సంబంధిత గ్రామ సర్పంచ్, నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి ఆరా తీశారు. అనంత‌రం ఆ పిల్లలను దత్తత తీసుకోవాలని ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఫోన్ చేసి కోరారు. మంత్రి ఎర్రబెల్లి కోరడంతో ఆ పిల్లలను దత్తత తీసుకుంటానని దిల్ రాజు మాటిచ్చారు. అడగగానే ఆ పిల్లలను దత్తత తీసుకున్న నిర్మాత దిల్ రాజు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సంద‌ర్భంగా అభినందించారు.


logo