గురువారం 04 జూన్ 2020
Telangana - May 23, 2020 , 03:14:58

ప్రాథమికహక్కుగా డిజిటైజేషన్‌

ప్రాథమికహక్కుగా డిజిటైజేషన్‌

  • డిజిటల్‌ విధానం నేడు అత్యవసరం
  • డిజిటల్‌ అక్షరాస్యతను ప్రోత్సహించాలి
  • సీఐఐ సదస్సులో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశంలో నేడు డిజిటల్‌ విధానం ఎంతో అవసరమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. డిజిటల్‌ విప్లవం సాధించాలంటే డిజిటైజేషన్‌ను ప్రాథమిక హక్కుగా చూడాలని అన్నారు. డిజిటల్‌ ఆవిష్కరణలు ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండాలని తెలిపారు. డిజిటల్‌ విధానంలో మూడు ప్రధానమైన అంశాలు కీలకపాత్ర పోషిస్తాయని అంటూ.. రోజువారీ వ్యవహారాలు, వాణిజ్య కార్యకలాపాలు సాగించడానికి డిజిటల్‌ లిటరసీ, డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, డిజిటల్‌ ఇన్నోవేషన్‌పై దృష్టిసారించాలని చెప్పారు. కరోనా నేపథ్యంలో వివిధ రంగాలలో, జీవన విధానంలో డిజిటల్‌ వినియోగం పెరిగిందని తెలిపారు. ఎప్పటి మాదిరిగానే ప్రైవేట్‌రంగం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉన్నదని, ప్రభుత్వరంగాలకు మరికొంత సమయం పడుతుందని చెప్పారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో శుక్రవారం ‘డిజిటల్‌ రెవెల్యూషన్‌ ఇన్‌ పోస్ట్‌ కొవిడ్‌ ఎరా, టచింగ్‌ లైవ్స్‌ ఎన్‌రిచింగ్‌ బిజినెసెస్‌' అంశంపై డిజిటల్‌ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో నేషనల్‌ డిజిటల్‌ లిటరసీ మిషన్‌ను బలోపేతం చేయాలని, డిజిటల్‌ అక్షరాస్యతను ప్రోత్సహించాలని చెప్పారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేని పరిస్థితిలో నెలకొందని, ఆన్‌లైన్‌ విద్యను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో టీశాట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో విద్యార్థులకు తరగతులను నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన టీ వర్క్స్‌ ప్రపంచస్థాయి ప్రమాణాలతో కరోనా రోగులకోసం వెంటిలేటర్‌ను తయారుచేసిందని, దీని ధర కేవలం రూ.35వేలని కేటీఆర్‌ తెలిపారు. టెలిమెడిసిన్‌ విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తున్నామని, డ్రోన్‌ల ద్వారా అత్యవసరమైన మందులను సరఫరాచేస్తున్నామని తెలిపారు. ఒక్కో రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న విధానాల గురించి ఒకరితో ఒకరు పంచుకోవడం ద్వారా అక్కడి ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చన్నారు. 

వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించాలి

తమిళనాడులోని తిరుప్పూర్‌ ఒకనాడు చిన్న గ్రామమని, నేడు అక్కడినుంచి రూ.40వేల కోట్ల విలువైన వస్త్రాలు ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి అవుతున్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. దేశంలో టెక్స్‌టైల్‌ పరిశ్రమను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. బంగ్లాదేశ్‌, శ్రీలంక లాంటి చిన్న దేశాలు ప్రపంచానికి అవసరమైన వస్త్రాలను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నాయని చెప్పారు. శ్రీలంక  7 నుంచి 8 శాతం వస్ర్తాలను ఎగుమతి చేస్తున్నదని, ఇండియా నుంచి కేవలం 4 నుంచిఐదు శాతం ఉత్పత్తులు మాత్రమే ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. అదే చైనా నుంచి 30-40 శాతం వరకు ఎగుమతి అవుతున్నాయన్నారు.హైదరాబాద్‌ నగరానికి షాంఘై, సిలికాన్‌ వ్యాలీ సహా ప్రపంచంలోని అనేక ఇతర నగరాలతో పోటీపడే సామర్థ్యం ఉందన్నారు. 

ఈ-స్పోర్ట్స్‌ పాలసీ రావాలి

కరోనా నేపథ్యంలో ఇండోర్‌ స్పోర్ట్స్‌కు ఈ-స్పోర్ట్స్‌ పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉందని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. దీనిపై కసరత్తు చేయాల్సిందిగా ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్‌కు సూచించారు. ఈ- స్పోర్ట్స్‌ పాలసీ తీసుకొచ్చే మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉండాలన్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ కార్యదర్శి అజయ్‌ ప్రకాశ్‌ సహాని మాట్లాడుతూ కరోనా నేపథ్యంలోనూ ఐటీలో 18 శాతం వృద్ధిని సాధించిన తెలంగాణను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, సీఐఐ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కృష్ణ బోడనపు, సీఐఐ మాజీ అధ్యక్షుడు రాజన్న, ఎస్టీపీఐ డీజీ ఓంకార్‌ రాయ్‌, మొబైల్‌ ప్రీమియర్‌ లీజ్‌ సీఈవో సాయి శ్రీనివాస్‌ కిరణ్‌లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తగా సీఐఐ డైరెక్టర్‌ సుబహాజిత్‌ సహా వ్యవహరించారు. 


logo