శనివారం 04 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 19:37:00

రవాణాశాఖలో టోకెన్‌ విధానం..

రవాణాశాఖలో టోకెన్‌ విధానం..

తిమ్మాపూర్‌:  కరోనా నేపథ్యంలో రవాణాశాఖ కార్యాలయంలో వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా  అధికారులు టోకెన్‌ విధానానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా కరీంనగర్‌ జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో డిజిటల్‌ క్యూ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (టోకెన్ల విధానాన్ని)ను అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానాన్ని బుధవారం జిల్లా రవాణాశాఖ అధికారి (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్‌ ప్రారంభించారు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిలిచిపోయిన పనులు చేసుకునేందుకు రవాణాశాఖకు నిత్యం వాహనదారులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. 

రిజిస్ట్రేషన్లు, లైసెన్స్‌లు, తదితర సేవల కోసం అనేక మంది జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి వస్తుంటారు. ఇంతకు ముందు వాహనదారులు తమ పనులు పూర్తి చేసుకోవాలంటే వరుస క్రమంలో నిలబడి వేచి చూడాల్సి వచ్చేది. ప్రస్తుతం టోకెన్‌ విధానం వల్ల ఇబ్బందులు తప్పనున్నాయి. వివిధ పనుల కోసం వచ్చినవారిని ముందుగా ఇక్కడ ఏర్పాటు చేసిన పరికరం ద్వారా టోకెన్‌ ఇచ్చి, భౌతిక దూరం పాటిస్తూ కూర్చోబెడతారు. తెరపై టోకెన్‌ నెంబర్‌తో పాటు ఏ కౌంటర్‌కు వెళ్లాలో చూపిస్తుంది. దీంతో పాటు మైక్‌లో అనౌన్స్‌ చేస్తారు. టోకెన్‌ నెంబర్‌ రాగానే ఆ కౌంటర్‌ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా సిబ్బందికి, అటు వివిధ పనుల కోసం వచ్చే వారికి సేవలు సులభతరం కానున్నాయని డీటీసీ శ్రీనివాస్‌ తెలిపారు.logo